Tuesday, July 21, 2026
HomeUncategorized‘రోడ్డు వేస్తారా? ప్రాణాలు తీస్తారా?’.. మహాధర్నా

‘రోడ్డు వేస్తారా? ప్రాణాలు తీస్తారా?’.. మహాధర్నా

TG:గన్నేరువరం, ప్రభాత జాగృతి: గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్‌ రోడ్డు మంజూరై మూడేండ్లు గడుస్తున్నా.. ఇంకా పనులు పూర్తికాకపోవడాన్ని నిరసిస్తూ.. నెలరోజుల్లోగా రహదారి పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 16న గుండ్లపల్లి రాజీవ్‌ రహదారిపై మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే మహాధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు యువజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గన్నేరువరం మండల కేంద్రంలో గురువారం నిరసన తెలిపి డబుల్‌ రోడ్డు కోసం చేపట్టే మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ‘రోడ్డు వేస్తారా? ప్రాణాలు తీస్తారా?’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు రూ.71 కోట్లతో డబుల్‌ రోడ్డు మంజూరై మూడేండ్లు గడుస్తున్నా రోడ్డు పనులు పూర్తి కాలేదని, కాంట్రాక్టర్‌ కంకర పోసి వదిలేయడంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కల్వంపల్లి సత్యనారాయణకు ఎన్నిసార్లు విన్నవించినా రోడ్డు సమస్యను పట్టించుకున్న పాపాన పోవడం లేదని, నాయకులకు, అధికారులకు కనువిప్పు కలిగేలా రోడ్డు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకపోవాలనే ఉద్దేశంతో ఈ మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డబుల్‌ రోడ్డు పూర్తిచేసే వరకు తమ పోరాటం ఆగదని యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు.

పోరాటానికి సిద్ధం:సొల్లు అజయ్‌వర్మ
గుండ్లపల్లి-పొత్తూరు డబుల్‌ రోడ్డు పూర్తయ్యేందుకు యువజన సంఘాలతో మమేకమై పోరాటం చేస్తామని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు సొల్లు అజయ్‌ వర్మ తెలిపారు. మహాధర్నకు మద్దతు తెలుపుతూ ధర్నాలో పాల్గొంటామని వివరించారు.

బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు:మాజీ జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి
యువజన సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నాకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని మాజీ జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి తెలిపారు. ‘ఎమ్మెల్యేగా కవ్వంపల్లి సత్యనారాయణ గెలిచి రెండేండ్లు గడిచినా డబుల్‌ రోడ్డుకు మోక్షం రాలేదు?.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఈ రోడ్డును వాడుకొని అధికారంలోకి రాగానే వదిలేసింది. ఎమ్మెల్యేగారూ..ఇంకెప్పుడు డబుల్‌ రోడ్డు, కల్వర్టులు నిర్మిస్తరు?’ అని నిలదీశారు. ఈ మహా ధర్నాకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయంతం చేయలని పిలుపునిచ్చారు.

Related News

తాజా వార్తలు