Tuesday, July 21, 2026
Homeవార్తలుకరీంనగర్‌ విద్యారంగం భేష్‌..

కరీంనగర్‌ విద్యారంగం భేష్‌..

TG:కరీంనగర్‌, ప్రభాత జాగృతి : జిల్లాలో కలెక్టర్‌ పమేలా సత్పతి నేతృత్వంలో విద్యారంగ అభివృద్ధికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరు మురళి ప్రశంసించారు. దాదాపు 20 అంశాలకు పైగా విద్యారంగా అభివృద్ధికి ప్రత్యేకంగా వినూతన్న కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతిని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా విద్యారంగ అభివృద్ధికి చేపట్టిన సంస్కరణలు, వినూత్న కార్యక్రమాలపై గురువారం కరీంనగర్‌ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులతో ఆకునూరి మురళి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ వివరించారు.

కార్యక్రమాలపై చైర్మన్‌ సంతృప్తి
పాఠశాలల్లో బుధవారం బోధన స్నేహిత, కాన్షియస్‌ క్లబ్‌ల ఏర్పాటు, ట్రాఫిక్‌ అవగాహన కార్యక్రమాలు, విటమిన్‌ గార్డెన్స్‌ ఏర్పాటు, ఇండియన్‌ సైన్స్‌ లాంగ్వేజ్‌, గణితం, సైన్స్‌ ఒలింపియాడ్‌, టెట్‌ ఎడ్‌ సమ్మర్‌ క్యాంప్స్‌, తదితర వినూత్న కార్యక్రమాలపై కలెక్టర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వగా వాటి ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిసి చైర్మన్‌ సంతృప్తి వ్యక్తంచేశారు. పాఠశాలల పనితీరు, విద్యార్థుల హాజరు, ఫలితాలు, ఉపాధ్యాయుల వివరాలు, హాజరు శాతం ఇలా అన్ని విషయాలను తెలుసుకున్నారు.

సీఎం దృష్టికి తీసుకెళ్తా
ఈ సందర్భంగా విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరు మురళి మాట్లాడుతూ కరీంనగర్‌ జిల్లాలో చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. సీఎంతో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు అమలయ్యేలా కృషి చేస్తానని చెప్పారు.విద్యారంగ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ఇందులో భాగంగానే పైలట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా పైలట్‌ ప్రాజెక్టు కింద 200 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వెల్లడించారు. ఐదు ఎకరాల స్థలంలో కార్పొరేట్‌ స్థాయిలో ఈ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారని, కార్పొరేట్‌ స్థాయిలో ఉంటాయని వివరించారు. ఒకే చోట ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు చదువుకునేలా ఏర్పాటు చేస్తున్నారని స్పష్టంచేశారు. ఒక్కో స్కూలుకు దాదాపు రూ.15 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు.

కరీంనగర్‌కు మంచి పేరు వచ్చేలా కృషి: కలెక్టర్‌ పమేలా సత్పతి
కరీంనగర్‌ జిల్లాలో విద్యారంగ అభివృద్ధి కోసం విద్యాశాఖ అధికారులతో కలిసి సమష్టిగా కృషి చేస్తూ మంచి ఫలితాల సాధనకు తమ వంతు బాధ్యతగా పనిచేస్తున్నామని కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాకు విద్యారంగంలో మంచి పేరు వచ్చేలా కష్టపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరిస్తున్నారని తెలిపారు.

చల్లూరు పాఠశాల సందర్శన
వీణవంక మండలం చల్లూరు ప్రభుత్వ హైస్కూల్‌ను ఆకునూరు మురళి సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఏమైనా సమస్యలున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో చక్కని విద్య బోధిస్తున్నారని సంతృప్తి వ్యక్తంచేశారు. మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.

Related News

తాజా వార్తలు