భవిత కేంద్రాల్లో అందించే ప్రత్యేక విద్యా విధానం ద్వారా దివ్యాంగ పిల్లలు మానసికంగా అభివృద్ధి చెందుతారని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కొత్తగా నిర్మించిన భవిత కేంద్రాన్ని (ప్రత్యేక అవసరాలు గల పిల్లల పాఠశాల) బుధవారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. భవిత కేంద్రాల్లో ప్రత్యేక పద్ధతిలో విద్యా బోధన ద్వారా దివ్యాంగ విద్యార్థుల్లో ఎంతో మార్పు కనిపిస్తోందని చెప్పారు. చిన్న వయసులోనే భవిత కేంద్రంలో చేర్పిస్తే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు తమ తల్లిదండ్రుల అవసరం లేకుండానే సొంతంగా వారి పనులు చేసుకునే స్థాయికి చేరుకోగలరని తెలిపారు.జిల్లాలో “దివ్య దృష్టి” కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అంధుల, బధిరుల పాఠశాల, భవిత కేంద్రాలను ఎంతగానో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అక్కడ చదివే పిల్లల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అధికారులకు, పాఠశాలలు, ఆసుపత్రుల సిబ్బందికి సైగల భాష నేర్పడం ద్వారా బధిరుల భావాలను వారు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. భవిత కేంద్రాల్లో పని చేస్తున్న ప్రత్యేక విద్య బోధించే ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని కొనియాడారు.
భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు :అడిషనల్ కలెక్టర్
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ దివ్యాంగుల కోసం జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.దివ్యాంగుల పాఠశాలలు,భవిత కేంద్రాల్లో అన్ని రకాల సదుపాయాలను కల్పించామని చెప్పారు.భవిష్యత్తులో దివ్యాంగ విద్యార్థుల చదువు,వారి అభివృద్ధికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మొండయ్య,తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీడీవో మల్హోత్ర,విద్యా శాఖ కో ఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్,ఎంఈఓ శ్రీనివాస్,డీఈ కృష్ణ కుమార్,ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.

