ఇంకా రోజుల్లో చదువు రానివారు.. వచ్చినా సరిగ్గా రాయలేనివారు.. రాసినా దరఖాస్తు ఫారాలను నింపాలంటే భయపడేవారు ఎందరో ఉన్నారు. కానీ ఇక్కడ రెండు చేతులు లేకున్నా కాలితో రాత రాస్తూ ఓ దివ్యాంగుడు అందరినీ అబ్బురపరుస్తున్నాడు. కాలితో రాయడమే కాదు.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు నామినేషన్ పత్రాలను కూడా స్వయంగా తానే నింపి ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.
దేవరుప్పులలో మంగళవారం కనిపించిన ఈ అద్భుత సందర్భం చూపరుల హృదయాన్ని హత్తుకున్నది. అంగవైకల్యం ఉన్నా సేవాభావంతో ముందుకు సాగుతున్న ధరావత్ స్వామి, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు నామినేషన్ పత్రాల్లో వివరాలు నింపుతూ సహాయం చేశాడు. పాదాలతోనే పత్రాలు రాయడం, వివరాలు నమోదు చేయడం ఆయన ప్రతిభకు తార్కాణంగా నిలిచింది.
అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నది. నామినేషన్ వేయడానికి వచ్చి ఉన్న అభ్యర్థి పత్రాలను సక్రమంగా నింపే పనిని స్వామి సమర్థవంతంగా పూర్తి చేశాడు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన గ్రామస్థులు, నాయకులు ధరావత్ స్వామి సేవాభావాన్ని మెచ్చుకున్నారు. అంగవైకల్యం ఉన్నా, సమాజ సేవలో తనవంతు సాయం చేస్తున్న స్వామిని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు.

