రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రెండు గ్రామాల్లో శుక్రవారం తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే పోలీసులు..స్థానికుల కథనం మేరకువివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దొంతరవేని విజయ్ కుమార్(22) అనే యువకుడు మరి కొంతమంది స్నేహితులతో కలిసి అర్ధరాత్రి హుస్నాబాద్‌కు వెళ్తుండగా కొండాపూర్ గ్రామ శివారులోని కోళ్ల ఫారం మూలమలుపు వద్ద అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
అదే ద్విచక్ర వాహనంపై ఉన్న మరో యువకుడు స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.దొంతరవేణి రాములు శ్రీలతకు ఒక కుమారుడు,కూతురు ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గాగిరెడ్డిపల్లే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.విజయ్ కుమార్ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
మండలంలోని సుందరగిరి గ్రామ శివారులోని గాగిరెడ్డిపల్లెకు వెళ్లే ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సుందరగిరి గ్రామానికి చెందిన గందె రాజయ్య(69) అనే వృద్ధుడు అక్కడికి అక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందాడు.శ్రీమూర్తి వెంకన్న తన వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి అకస్మాత్తుగా రోడ్ ఎక్కటంతో ట్రాక్టర్ టీవీఎస్ ఎక్సెల్ వాహనం వెనుక భాగాన్ని ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో రాజయ్య తలకు తీవ్ర గాయమై రక్తస్రావం అయింది.ఇరువురి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చిగురుమామిడి ఎస్సై రేణికుంట సాయికృష్ణ తెలిపారు.
ఈ రెండు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని, ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ప్రాణం విలువ చాలా విలువైందని ఎస్సై వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.

