TG: వానాకాలం సీజన్లో రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల , పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పంట కొనుగోలుపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు , సీఎస్ కే.రామ కృష్ణ రావు, ఇతర ఉన్నతాధికారులతో కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ పెద్దపల్లి నుంచి కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి. వేణుతో కలిసి వీసిలో పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ.. 1640 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ఓపెన్ చేయలేదని, వీటిని తక్షణమే ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల లోగా చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిందని, దీనికి అనుగుణంగా వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు.
ధాన్యం కొనుగోలు సంబంధించి పత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలకు ఎప్పటికప్పుడు రిజెండర్ జారీ చేయాలని మంత్రి తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్ఫాలిన్ కవర్లు, గన్ని బ్యాగులు, ప్యాడి క్లీనర్లు సిద్ధం చేసుకోవాలని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా లక్ష 10 వేల ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ధాన్యం కొనుగోలు కట్టుదిట్టంగా జరుగుతూ, రైతులకు కొంత మేర ఉపశమనం లభించేలా పని చేయాలని అన్నారు. తేమ శాతం లేకపోయినా కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదని తెలిపారు. సీఎస్ కె. రామ కృష్ణా రావు మాట్లాడుతూ..నవంబర్లో అధికంగా ధాన్యం కొనుగోలు జరుగుతుందని, దీనికి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని, రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు సకాలంలో అందించాలని తెలిపారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ 3 లక్షల 41 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంతో జిల్లాలో 394 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న 20 రోజులలో 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతుందని అన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ శ్రీకాంత్,జిల్లా సహకార అధికారి శ్రీమాల జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈవో నరేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

