Tuesday, July 21, 2026
Homeవార్తలుసర్కారు మరిచిపోయింది.. కలెక్టర్‌కు విజ్ఞప్తి

సర్కారు మరిచిపోయింది.. కలెక్టర్‌కు విజ్ఞప్తి

TG: ‘కలెక్టర్‌ గారు మీరైనా మా డబుల్‌ రోడ్డు, కల్వర్టుల నిర్మాణం గురించి పట్టించుకోండి.. మా బాధలను ఎమ్మెల్యే కవ్వంపల్లి పట్టించుకుంటలేడు. మా గన్నేరువరం మండల ప్రజల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి’ అంటూ బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ యువసారధి, వివేకానంద యూత్‌ అధ్యక్షుడు గూడూరి సురేశ్‌ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ పమేలా సత్పతికి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

గన్నేరువరం మండలంలో తొందరగా డబుల్‌ రోడ్డును, కల్వర్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, పనులు పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని విన్నవించారు. ఓవర్‌ లోడ్‌తో రోడ్లను ధ్వంసం చేస్తూ వెళ్తున్న గ్రానైట్‌ లారీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువు మత్తడుల వద్ద పాత కల్వర్టులపై గ్రానైట్‌ లారీలు అధికలోడుతో వెళ్తుండడం వల్ల రోడ్డు నాశనమవుతున్నదని చెప్పారు. గన్నేరువరం మండలంలో డబుల్‌ రోడ్డు మంజూరై రెండున్నరేళ్లు గడుస్తున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క కల్వర్టు నిర్మించలేదని, వాన చినుకు పడితే మండలానికి దారులు మూసుకుపోతున్నాయని, ప్రజలకు వైద్యం, విద్య, ఇతర అవసరాల కోసం రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గన్నేరువరం నుంచి గుండ్లపల్లి వెళ్లే దారిలో జంగపల్లి వద్ద కల్వర్టు, గుండ్లపల్లి వద్ద కల్వర్టు అధిక లోడుతో గ్రానైట్‌ లారీలు వెళ్లడం ద్వారా ధ్వంసమయ్యాయని వివరించారు. గన్నేరువరం చెరువు మత్తడి వద్దకు దాటలేని పరిస్థితి ప్రజలకు ఉన్నదని, గన్నేరువరం ప్రజలు ఎటూ పోలేని పరిస్థితి ఉన్నదని, చెరువు మత్తడి వద్ద వెంటనే హై లెవెల్‌ కల్వర్టు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మంజూరైన కాల్వర్టులను తొందరగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని, ఓవర్‌ లోడ్‌తో వెళ్లే గ్రానైట్‌ లారీలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వేసిన రోడ్డు భారీ వర్షాలు, వరదలకు కోతకు గురైందని, కొండాపూర్‌ వద్ద సగం మట్టుకు తెగిపోయి అత్యంత ప్రమాదకరంగా మారిందని, అయినా ఎమ్మెల్యే, అధికారులు రోడ్డు దుస్థితి గురించి పట్టించుకోవడం లేదని గూడూరి సురేశ్‌ విమర్శించారు. కొంత కాలంగా ఇక్కడ తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, పక్కనే బావి కూడా ఉండటంలో ఎప్పుడేం పెనుప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ప్రజలు వ్యవసాయ పనులకు, ఇతర పనులకు నిత్యం ఈ దారి నుంచే వెళ్లివస్తుంటారని, ఈ క్రమంలో రాత్రిపూట వ్యవసాయ పనులు ముగించుకొని వచ్చే రైతులు, కూలీలకు ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు.

గన్నేరువరం మండల కేందంతో పాటు చుట్కుపక్కల గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. ఈ రోడ్డును కాంగ్రెస్‌ ఎన్నికల్లో వాడుకొని మండలంలో ఓట్ల లబ్ధి పొందిందని, అధికారంలోకి రాగానే ఈ రోడ్డును పూర్తి చేయిస్తామని చెప్పి ఇప్పుడు దీని గురించి పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయాలకు వాడుకోవడం తప్ప ఈ రహదారిని ఎన్నడు బాగు చేస్తారని నిలదీశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేండ్లయినా ఒక్క కొత్త రోడ్డు వేసింది లేదని, కనీసం మంజూరైన రోడ్లను కూడా పూర్తి చేయలేదని చెప్పారు. కలెక్టర్‌ స్పందించి ఈ రోడ్డును బాగు చేసి తమను ప్రమాదాల నుంచి కాపాడాలని కోరారు..

Related News

తాజా వార్తలు