పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్ డిపో నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన జరగింది. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్థానిక నాయకులు, ఆర్టీసీ అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని పునాది రాయి వేశారు. అనంతరం డిపో ఏర్పాటు చేయనున్న పాత ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణాన్ని సందర్శించి, అక్కడి పాడైన భవనాలు, తొలగించిన చెట్ల పరిసరాలు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటు ప్రజల చిరకాల కోరిక అని పేర్కొన్నారు. ఇటీవల పెద్దపల్లి కేంద్రంలో జరిగిన యువ వికాస సభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిపో స్థాపనకు జీవో ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇందుకు అనుగుణంగా 4 ఎకరాలు 34 గుంటల భూమిని ఆర్టీసీకి కేటాయించినట్టు తెలిపారు.
సివిల్ సప్లై గోదాం,ఈఈ కార్యాలయం, మండల పరిషత్ వంటి కార్యాలయాలను తరలించడం, పాత చెట్ల తొలగింపు వంటి ప్రారంభ ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. డిపో నిర్మాణానికి అవసరమైన రూపకల్పనను ఆర్ఎం నేతృత్వంలో సిద్ధం చేస్తుండగా, 6 నుండి 8 నెలల్లో పనులు పూర్తి చేసి, పెద్దపల్లిలో నుంచే బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
బస్ డిపో మంజూరులో సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

