వెస్టిండీస్ కెప్టెన్ షాయి హోప్ (109 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో పోరాడినా, న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో కరీబియన్ జట్టు ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 86/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్లిష్ట సమయంలో హోప్ నిలకడగా ఆడి, 42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయిన అతను కేవలం 66 బంతుల్లోనే శతకం పూర్తి చేసి, జట్టు స్కోరును 247/9 పరుగులకు చేర్చాడు.
ఛేజింగ్‌లో కివీస్ ఓపెనర్లు డెవాన్ కాన్వే (90), రచిన్ రవీంద్ర (56) అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. అయితే మధ్యలో యంగ్, చాప్మన్ వంటి బ్యాటర్లు త్వరగా ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ సమయంలో కివీస్ సారథి మిచెల్ శాంట్నర్ (34 నాటౌట్), టామ్ లాథమ్ (39 నాటౌట్)కు జతకలిశాడు. శాంట్నర్ రెండు సిక్సులు, మూడు ఫోర్లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి, మూడు బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్‌కు విజయాన్ని అందించాడు.

