కరీంనగర్: కేవలం 7 రోజుల వయసున్న పసికందును విక్రయించడానికి యత్నించిన ముఠాను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పేదరికం, భర్త వదిలేసాడన్న కారణంతో కన్నతల్లే బిడ్డను అమ్మకానికి పెట్టడం, దానికి మధ్యవర్తులు సహకరించిన ఘటన నగరంలో కలకలం రేపింది. వైజాగ్‌కు చెందిన శీలం సాయిశ్రీ (22) అనే మహిళకు భర్తతో విభేదాలు రావడంతో గర్భిణిగా ఉన్న ఆమెకు హైదరాబాద్‌కు చెందిన స్నేహితులు అభినవ్, హీనా ఆశ్రయం కల్పించారు.
నవంబర్ 14న సాయిశ్రీ గాంధీ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, సాయిశ్రీ ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకున్న అభినవ్, హీనా బిడ్డను పోషించడం కష్టమని, ఎవరికైనా అమ్మితే డబ్బులు వస్తాయని ఆమెను నమ్మించారు. ఇందుకు సాయిశ్రీ ఒప్పుకోవడంతో, హీనా తనకు తెలిసిన పల్లవి, భవాని అనే మధ్యవర్తుల ద్వారా కరీంనగర్లో బేరం కుదుర్చుకున్నారు. రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న ముఠా, నవంబర్ 20న కారులో అశోక్ అనే డ్రైవర్‌తో కరీంనగర్ చేరుకున్నారు. స్థానిక పెళ్లిళ్ల బ్రోకర్ భవాని సూచన మేరకు నగరంలోని ఆర్య ఆసుపత్రి వద్దకు వెళ్లి బిడ్డను కొనుగోలుదారులకు చూపించారు.
అయితే అక్కడ డబ్బుల విషయంలో గొడవ జరగడం, అనుమానాస్పదంగా వ్యవహరించడాన్ని గమనించిన ఓ ఆటో డ్రైవర్ వెంటనే ’డయల్ 100’కు సమాచారం అందించారు. పోలీసులు అప్రమత్తం కావడంతో భయపడిన ముఠా అక్కడి నుండి పరారయ్యేందుకు ప్రయత్నించింది. నిందితులను కిసాన్ నగర్ పెళ్లిళ్ల బ్రోకర్ భవాని ద్వారా రూ. 5 లక్షలు నగదు తీసుకుంటుండగా, కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ జే అరుణ్, పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి పసికందును రక్షించి, విక్రయానికి తీసుకున్న నగదును, కారును స్వాధీనం చేసుకున్నారు. తల్లి సాయిశ్రీ, మధ్యవర్తులు హీనా, అభినవ్, భవాని, కారు డ్రైవర్ అశోక్ తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

