హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నైతిక విజయం బీఆర్ఎస్దేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినా బీఆర్ఎస్ చివరిదాకా గట్టి పోటీనిచ్చిందని, కాంగ్రెస్‌తో మజ్లిస్, పరోక్షంగా బీజేపీ జత కట్టినా బీఆర్ఎస్ ఒంటరిగా పోరాడి పార్టీ ఉణినికి చాటుకున్నదని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ విజయం సాధించారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఓట్ల లెక్కింపు జరుగగా చివరి రౌండ్ వరకూ అధికార పార్టీకి బీఆర్ఎస్ గట్టిపోటీనిచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు 74,259 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు 98,988 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి కేవలం 17,061 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు.
ఈ ఫలితాలు చూస్తుంటే అధికార కాంగ్రెస్, బీజేపీ కలిసి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసిపోతున్నదని, ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ను అణగదొక్కేందుకే ఆ రెండు పార్టీలు కలిసి పనిచేసినట్టు తెలుస్తున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు ఎన్నికల వ్యవస్థలను వాడుకుని కాంగ్రెస్ గెలిచిందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వేలాది మందితో దొంగ ఓట్లు వేయించి ఆ పార్టీ విజయం సాధించిందని, పోలీసులను కూడా వాడుకున్నారని, ఇన్ని అడ్డంకులున్నా బీఆర్ఎస్ పార్టీకి 39 శాతం ఓట్లు రావడం విశేషమేనని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ సమర్థంగా ప్రజల్లో ఎండగట్టిందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ తీరును ఉప ఎన్నికలో ప్రచారాస్త్రంగా మలుచుకున్నదని, ఈ విషయంలో గణనీయంగా ప్రజల మద్దతు పొందడంతోపాటు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ నిలిచిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి సంచనల ఆరోపణలు
మరోవైపు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ రౌడీయిజం చేసి గెలిచారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యం ముసుగులో అప్రజాస్వామిక పద్ధతిలో జరిగిన ఎన్నికలో ఓడిపోయినా నైతిక విజయం తనదేనని చెప్పారు. కౌంటింగ్ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఒక ఆడబిడ్డపై సీఎం, మంత్రులంతా కలిసి దౌర్జాన్యానికి దిగారని, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ రౌడీలు దాడులు చేశారని, పోలింగ్ బూత్‌లను ఆక్రమించి దొంగ ఓట్లు వేయించారని, ఎలక్షన్ కమిషన్ ఘోరంగా విఫలమైందని, జూబ్లీహిల్స్ మాదిరిగా కాంగ్రెస్ చేసిన దౌర్జన్యాలు, దాడులు ఎక్కడా జరగలేదని, కాంగ్రెస్ గూండాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చిపోయారని ఎన్నికలు జరిగిన తీరును తూర్పారబట్టారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి తగినంత బలం లేదని స్వయంగా ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పడం గమనార్హం. ఢిల్లీ నుంచి ఆయన స్పందిస్తూ జూబ్లీహిల్స్‌లో ఏనాడూ బీజేపీ గెలువలేదని, అక్కడ ఒక్క కార్పొరేటర్ కూడా తమ పార్టీకి లేడని చెప్పారు. తాను ఆలస్యంగా ఇన్చార్జి బాధ్యతలు తీసుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రచారం నిర్వహించానని, ఫలితాలు అనుకూలంగా రావని తెలిసినా పోటీ చేశామని చెప్పారు. దీన్నిబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికలను కావాలనే పట్టించుకోలేదని, బలహీనమైన అభ్యర్థిని బరిలో దింపి పరోక్షంగా కాంగ్రెస్‌కు సహకరించి బీఆర్ఎస్ను ఓడించేందుకు పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని కుట్రలను తట్టుకొని బీఆర్ఎస్ తన బలాన్ని చాటుకున్నదని చెప్తున్నారు.

