తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత తనదైన మార్కును చాటుతూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి పేరుతో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేపట్టారు. కవిత చేపట్టిన ఈ పర్యటనతో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సైతం జిల్లాల పర్యటనలు చేయడం ప్రారంభించారు. నిజామాబాద్, ఆదిలాబాద్ పర్యటనలు ముగించుకున్న కవిత ఖమ్మం పర్యటన చేపట్టగానే బీఆర్ఎస్ నాయకులు సైతం జిల్లాల పర్యటన చేపట్టి ప్రజలకు దగ్గరయ్యే లా కసరత్తు చేశారు.
అందులో భాగంగా కేటీఆర్ ఆదిలాబాద్ లో రైతు ల సమస్యను తెలుసుకుని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంట పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం స్థానిక రైతుల పక్షాన నిలబడ్డారు. రైతులు పండించిన ప్రతి గింజలు కొనుగోలు చేసి వారి కష్టాన్ని తగిన ఫలం ఇవ్వాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇలా కవిత వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య జిల్లాల పర్యటన తెరమీదికి వచ్చింది. కవిత కదలికతో, బీఆర్ఎస్ నేతల్లో మార్పు వచ్చింది అని చెప్పక తప్పదు. ఇప్పటికే టీచర్స్ ఫెడరేషన్తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన కవిత విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు పది కీలక అంశాలను తెరమీదకి తీసుకువచ్చింది.
అటు రైతుల పక్షాన ఇప్పటికే ఆమె నిలిచిన విషయం తెలిసింది. హరీష్ రావు కేటీఆర్ సైతం రైతుల పక్షాన నిలిచి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాగృతి అధ్యక్షురాలుగా కవిత, బీఆర్ఎస్ నాయకులుగా కేటీఆర్ హరీష్ రావుల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతున్న అనుమానం తెర మీదికి వస్తుంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, మరో ఇద్దరు నేతలపై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత తనదైన శైలిలో ముందుకు సాగుతూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ఈ ఆరోపణలను ఖండించడం లేదా వాటికి సమాధానమిచ్చిన సందర్భాలు లేవు. మరోవైపు కేసీఆర్ సైతం కవిత వ్యాఖ్యలకు సమాధానం చెప్పకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇక వాటన్నింటికీ పక్కన పెడితే ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా జాగృతి,బీఆర్ఎస్ నాయకులు జిల్లాల పర్యటన చేస్తూ పోటాపోటీగా నిలుస్తున్నారు. ఈ జిల్లా పర్యటనలు జాగృతికి లేదా బీఆర్ఎస్ కు కలిసి వస్తాయా లేదా అన్నది భవిష్యత్తులో తేలనుంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనల ప్రభావం తీవ్రంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

