Tuesday, July 21, 2026
Homeవార్తలుహరితహారంపై గొడ్డలివేటు.. సింగరేణిలో పర్యావరణంపై ప్రశ్నార్థకం

హరితహారంపై గొడ్డలివేటు.. సింగరేణిలో పర్యావరణంపై ప్రశ్నార్థకం

రామగిరి:సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ పేరుతో చేపట్టిన హరితహారం కార్యక్రమం ఇప్పుడు అధికారుల నిర్ణయాల వల్లే ప్రమాదంలో పడింది. సెంటినరికాలనీ పరిసరాల్లో గత కొన్నేళ్ల నుంచి సంరక్షించిన హరితవనంపై ఇటీవల పెద్ద ఎత్తున గొడ్డలి ఎత్తడం స్థానికుల ఆగ్రహానికి గురవుతోంది. కాలుష్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పచ్చదనమే రక్షగా భావించిన ప్రజలకు ఇప్పుడు ఆ ఆశ కూడా దూరమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వందల ఎకరాల్లో గుబురు అడవిని తలపించేలా పెరిగిన చెట్లు, వెదురు తోటలు ఈ ప్రాంతానికి అందాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా గాలి నాణ్యతను మెరుగుపరిచేవి. అయితే ఇటీవలి రోజులుగా భారీ యంత్రాలతో వనాన్ని ఒక్కొక్కటిగా నేలమట్టం చేస్తూ చదును చేస్తున్న దృశ్యాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఈ భూభాగంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం సమతలీకరణ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రహరీలు నిర్మించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని కార్మికులు తెలిపారు.

కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న మా కాలనీకి హరితవనం ఊపిరిలా ఉంది. అదే నరికి వేసేస్తే మా ఆరోగ్యం ఏమవుతుందోనని మాకు భయం వేస్తోందనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్లు నరుకుతున్న విభాగంపై చర్యలు తీసుకోవాలని, పర్యావరణ ప్రభావ నివేదిక (EIA) లేకుండా ఇలాంటి పనులు చేయడం సరికాదని వారు ఆరోపిస్తున్నారు.

పర్యావరణ సంరక్షణలో ముందుండాల్సిన సింగరేణి అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వందలాది చెట్లు నరుకుతుండగా ఎవ్వరూ స్పందించకపోవడం ఆందోళన కలిగించే విషయమనీ పర్యావరణప్రేమికులు పేర్కొంటున్నారు. గాలి కాలుష్యం పెరిగి ప్రజలు శ్వాసకోశ సమస్యలు, వేడి పెరుగుదల, దుమ్ము కాలుష్యం వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపి, వృక్ష నరికివేతను నిలిపివేయాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ స్థలంలో సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలనే డిమాండ్ పెరుగుతోంది. పచ్చదనం కోసం నడిచే హరితహారం కార్యక్రమం పర్యావరణానికి ముప్పు తెచ్చిపెట్టే చర్యలతోనే నష్టపోవడం విచారకరమని ప్రజలు అంటున్నారు.

Related News

తాజా వార్తలు