తాండూర్: బీసీలకు 42శాతం చట్టబద్ధత కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరు బీసీ సంఘం ఆధ్వర్యంలో సబ్-కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవడం అన్యాయం అని అన్నారు. 17వ తేదీ క్యాబినెట్ సమావేశంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని, పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం, అలాగే కేంద్రం నుండి నిధులు పొందడానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పడం బీసీలను మభ్యపెట్టే రాజకీయ మాటలు తప్ప మరేమీ కావని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య పిలుపుమేరకు తాండూర్ సబ్-కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టినట్లు తెలిపారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకోమని అన్నారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని అన్నారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర నాయకులు, పలు సంఘాల అధ్యక్షులు, మరియు ఉపాధ్యక్షులు, యువ నాయకులు, మహిళా సంఘాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

