పెద్దపల్లి: అభివృద్ధి ఛార్జీలు మరియు అదనపు సెక్యూరిటీ డిపాజిట్ పేరిట విద్యుత్ శాఖ,వినియోగదారులను దోచుకుంటోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం ఆరోపించారు. విద్యుత్ శాఖా తీరుకు నిరసనగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ.. గతంలో పరిశ్రమలు,వాణిజ్య అవసరాలకే విధించిన ఏసీడీ ఛార్జీలను ప్రస్తుతం 300 యూనిట్లకు మించి వినియోగించే గృహాలకు సైతం వర్తింపజేయడం అన్యాయమని,ఇది వినియోగదారులపై అదనపు భారం మోపడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఎస్-ఈఆర్సీ మార్గదర్శకాల ప్రకారం 30 రోజుల ముందే నోటీసు ఇవ్వకుండా,బిల్లులో స్పష్టత లేకుండానే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు.ఈ వసూలును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.కొత్త రేషన్ కార్డులు పొందిన అర్హత కలిగిన లబ్ధిదారులకు,అలాగే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోని వారికి కూడా గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం ప్రయోజనాలు వర్తింపజేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రధానమంత్రి ఉచిత విద్యుత్ కనెక్షన్ల గురించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని,దీనివల్ల ప్రజలు దళారులను నమ్మి మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ కోతలు,లో-వోల్టేజీ సమస్య తలెత్తకుండా ప్రజలకు,రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.ప్రజల అవసరానికి అనుగుణంగా కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల విద్యుత్ స్తంభాలు,వీధి దీపాలు,ట్రాన్స్ఫార్మర్లను బిగించాలని కోరారు.ట్రాన్స్ఫార్మర్ ట్రిప్పింగ్ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.పాలకూర్తి మండలం,తక్కళ్ళపల్లి గ్రామంలో 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడిన ఘటన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలనే జరిగిందని ఆరోపిస్తూ,సమస్యలపై క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించాలని కోరారు.ధర్నా అనంతరం బీజేపీ నాయకులు విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జంగ చక్రదరరెడ్డి, అక్కెపల్లి క్రాంతికుమార్,భూషణవేణి శ్రీనివాస్ గౌడ్,మోర మనోహర్,శివంగారి సతీష్,ముస్త్యాల సంతోష్,కాసనగోట్టు విజయ్,పెండ్యాల కుమార్,బండ కరుణాకర్,కుక్క వంశీ,జెట్టి రాజు,బొంకూరి సాగర్,నూనేటి వెంకటేష్,మేరుగు రవీందర్,తిరుపతి,రేవల్లి సందీప్,సంపత్ చారి,నక్క శ్రీనివాస్,కలవేన స్వామి,కూడికల నితిన్ తో పాటు పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

