Tuesday, July 21, 2026
Homeవార్తలుఅలా చేయకండి.. భూసారం దెబ్బతింటుంది!

అలా చేయకండి.. భూసారం దెబ్బతింటుంది!

పెద్దపల్లి:పంట చేలల్లో అవశేషాలను కాల్చడం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న అనారోగ్యకర పద్ధతి. అయితే ఈ చర్య వెనుక రైతులకు తెలియని తీవ్రమైన దుష్ప్రభావాలు దాగి ఉన్నాయని పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కాంతాల అలివేణి హెచ్చరించారు.

పంట అవశేషాలను దహనం చేయడం వలన భూమిలో సహజంగా ఉండే సూక్ష్మజీవులు, వానపాములు వంటి భూసారాన్ని పెంచే జీవాలు నశించి పోతాయి. వీటి లేమితో భూమి పోషకాలు తగ్గిపోయి, పంటల పెరుగుదల దెబ్బతింటుంది. సహజంగా ఏర్పడే సారవంతమైన మట్టి కోసం వేల సంవత్సరాలు పట్టినా, రైతులు అవగాహన లేక పంట అవశేషాలను కాల్చడం ద్వారా మట్టిని క్షణాల్లోనే దెబ్బతీస్తున్నారు.

ఇదే సమయంలో పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. పొగ కారణంగా వాయు కాలుష్యం పెరగడమే కాకుండా, చేలలో వేడి అధికమవడం వలన తదుపరి పంట పై ప్రతికూల ప్రభావం పడుతోంది. అంతేకాకుండా విద్యుత్ లైన్ల కింద పంట అవశేషాలు కాల్చడం వలన గతంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయని అధికారులు గుర్తు చేశారు.

అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నడం, వేస్ట్ డీకంపోజర్ లాంటి పద్ధతులను ఉపయోగించడం ద్వారా అవశేషాలు త్వరగా కుళ్ళి సేంద్రీయ ఎరువుల్లా పనిచేస్తాయి. దీనివల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గి, పర్యావరణ సమతుల్యత కొనసాగుతుంది.రైతులు అవగాహనతో వ్యవహరించి పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలపడం ద్వారా భూసారాన్ని, పర్యావరణాన్ని కాపాడాలని వ్యవసాయ అధికారి అలివేణి సూచించారు.

Related News

తాజా వార్తలు