HYD: కరీంనగర్‌లో కట్టిన మానేరు రివర్ ఫ్రంట్‌లో అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని, జిల్లాలో ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
కరీంనగరంలో మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల పేరుతో గత ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసిందని, అందులో టూరిజం శాఖ 100 కోట్లు, నీటిపారుదల శాఖ 100 కోట్లు విడుదల చేశాయని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మానేరు రివర్ ఫ్రంట్ పనులను ఆ పార్టీ అనుచరులకే అప్పగించి పూర్తి చేయకపోవడం వల్ల నాణ్యత ప్రమాణాలు లోపించాయని, నిర్మాణదారులకు కొంత బిల్లులు చెల్లించినా పనుల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని వివరించారు. రి
వర్ ఫ్రంట్ పరిధిలో చెక్ డ్యాములు నిర్మిస్తే వాటిలోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో వరదలకు కొట్టుకుపోయాయని, చెక్ డ్యాములు కొట్టుకపోయినా నిధులు విడుదలయ్యాయని వెల్లడించారు. ఐదేండ్లు గడుస్తున్న పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, తక్షణమే పనుల్లో అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నదని చాడ చెప్పారు. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని చాడ వెంకటరెడ్డి తెలిపారు.

