TG:పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాంతంలో పోలీసుల ముసుగులో దోపిడీకి పాల్పడిన నిందితుల గ్యాంగ్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.గర్రెపల్లి గ్రామానికి చెందిన సంకరి లక్ష్మీ ఇంటిపై తెల్లవారు జామున జరిగిన ఈ దోపిడీ స్థానికులను కలవరపరిచింది.లక్ష్మీ తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారు జామున 4.15 గంటల సమయంలో “కరీంనగర్ వన్ టౌన్ పోలీసులం” అంటూ వచ్చిన నలుగురు వ్యక్తులు ఇంటి తలుపు తెరిపించి,ఆమె కుమారుడు రమేశ్‌ను నిద్రలేపి బేడీలు వేయించి, బీరువా తాళాలు తెరిపించి బంగారం,డబ్బులు దోచుకుపోయారు.అడిగితే ప్రాణాలు తీస్తామని బెదిరించి ఇంట్లోని వారిని భయభ్రాంతులకు గురి చేశారు.
ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి నాగుల కుమారస్వామి. గతంలో అనేక చోరీ కేసుల్లో జైలు జీవితం గడిపాడు.ఆ సమయంలోనే తిప్పరి రవీందర్, పోవరి శ్యామ్రావుతో పరిచయం పెంచుకున్నాడు. అందరూ అప్పుల బారిన పడి, డబ్బు కోసం దోపిడీకి పాల్పడాలని పన్నాగం పన్నారు. గర్రెపల్లి గ్రామంలో రమేష్ ఇటీవల వివాహం కావడంతో అతని ఇంట్లో బంగారం తప్పకుండా ఉంటుందని పురుషోత్తం నాగరాజు సూచించడంతో ఆ ఇల్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. దోపిడీ కోసం పోలీసుల్లా కనిపించేలా ఆన్లైన్లో బేడీలు కొనుగోలు చేసి, కరీంనగర్లో పోలీసు గుర్తులు, లేబుల్స్ ఉన్న స్వెట్టర్లు కొనుగోలు చేశారు. రెండు కార్లలో వచ్చి ముందుగా రెక్కీ చేసి, తర్వాత దాడి చేశారు.
సుల్తానాబాద్ పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు నిర్వహించి, కాట్నపల్లి శివారులో నిందితులను వాహనంతో సహా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 115 గ్రాముల బంగారం, 472 గ్రాముల వెండి, 10 వేల రూపాయలు, వాహనాలు, బేడీలు, నకిలీ నెంబర్ ప్లేట్స్, పోలీస్ స్వెట్టర్లు స్వాధీనం చేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందంలో సబ్ఇన్స్పెక్టర్లు శ్రావణ్‌కుమార్, సనత్‌రెడ్డి, వెంకటేశ్ మరియు సిబ్బంది కీలక పాత్ర పోషించారు.

