పెద్దపల్లి: ఎన్నికల విధులను నిబంధనల ప్రకారం అధికారులు కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని వీడియో పవర్ ప్రెజెంటేషన్ ద్వారా అవగహన కల్పిస్తూ ఎన్నికల విధుల పట్ల కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. జిల్లాలో ఉన్న శ్రీరాంపూర్, కమాన్ పూర్,రామగిరి ,మంథని ,ముత్తారం మండలాల పరిధిలో ఉన్న 99 గ్రామ పంచాయతీలకు, 896 వార్డులకు మొదటి విడతలో ఎన్నికలు జరుగుతాయని దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ 27న ఉదయం 10.00 గంటలకు విడుదల చేయాలని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధిలోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలని అన్నారు.
నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని అన్నారు.పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.
ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు చాలా ముఖ్యమైన అంశమని, దీని పైన చాలా కేసులు దాఖలు అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని , ప్రతి అంశం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. అధికారిక ప్రకారం మాత్రమే రిజర్వేషన్ అంశాలను పరిశీలించాలని అన్నారు.
ప్రతి నామినేషన్ కేంద్రం సమీపంలో 100 మీటర్ల మార్కింగ్ చేయాలని, స్థానిక పోలీసుల సహకారం తీసుకుంటూ అవసరం భద్రత ఏర్పాట్లు కల్పించాలని అన్నారు. ప్రతి రోజు దాఖలయ్యే నామినేషన్ వివరాలు ఎప్పటికప్పుడు టి-పోల్ యాప్ వెబ్ సైట్ లో నమోదు చేయాలని అన్నారు.
నామినేషన్ల పరిశీలన నవంబర్ 30 న సాయంత్రం 5 గంటల వరకు పూర్తి చేసి చెల్లుబాటైనా నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అన్నారు. అభ్యర్థుల జాబితా పై అప్పిళ్ళ కోసం డిసెంబర్ 01, సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని, డిసెంబర్ 2 నాడు ఆపిళ్ళ పరిష్కరించాలని, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 03 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుందని, అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయాలని అన్నారు .
నామినేషన్ల స్వీకరణ, పరిశీలన,అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో ఎక్కడైనా సర్పంచ్ అభ్యర్థికి 8, వార్డు సభ్యులకు 6 కంటే ఎక్కువ నామినేషన్ దాఖలు ఐతే తమకు తెలియజేయాలని అన్నారు.
ప్రతి అధికారి కొత్తగా ఎన్నికల నిర్వహిస్తున్నట్లు భావించి జాగ్రత్తగా నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని, ఎక్కడ నిర్లక్ష్యం ప్రదర్శించడానికి వీలు లేదని అన్నారు. ప్రతి చిన్న అంశాన్ని, అనుమానాలను శిక్షణ లో పూర్తి స్థాయిలో విచారించి తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ట్రైనింగ్ హల్ నుంచి సంపూర్ణ అవగాహనతో బయటకు పోవాలని అన్నారు. పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలంటే మనకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలని, లేని పక్షంలో పోలింగ్ ఏజెంట్లు మన పై తీవ్ర ఒత్తిడి తీసుకొని వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఈఓ నరేందర్, ఆర్ఓస్, ఏఆర్ఓస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

