పెద్దపల్లి: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో యాదవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈనెల 28న పెద్దపల్లిలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్ తెలిపారు.
మంగళవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ట్రస్ట్ సభ్యులతో కలిసి ఉద్యోగ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మారం తిరుపతి యాదవ్ మాట్లాడుతూ, దాదాపు 18 ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొననున్నాయని, సుమారు 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు.
పెద్దపల్లి శాంతినగర్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం భవన ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయని వివరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ముఖ్య అతిథిగా హాజరై మేళాను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అన్ని వర్గాల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నాయకులు బత్తిని లక్ష్మణ్ యాదవ్, మల్లెత్తుల నాగరాజు యాదవ్, తమ్మడ బోయిన ఓదెలు యాదవ్, సభ్యులు ఎలుక కొమరయ్య, తువ్వ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

