కరీంనగర్: పోలీసు శాఖలో మహిళా ఉద్యోగులు కేవలం కార్యాలయ విధులకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించేలా కరీంనగర్ కమిషనరేట్ తీసుకున్న షీ-లీడ్స్ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పేర్కొన్నారు. కమిషనరేట్ కేంద్రంలో రెండు దశల్లో 102 మంది మహిళా కానిస్టేబుళ్లు, షీ-టీమ్స్ సభ్యులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది.
ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ ..‘మనల్ని మనం రక్షించుకునే స్థితిలో ఉన్నప్పుడే ప్రజలను సమర్థవంతంగా రక్షించగలం‘అని తెలిపారు. శారీరక, మానసిక దృఢత్వమే లక్ష్యంగా ఈ శిక్షణను రూపొందించినట్లు చెప్పారు. కేవలం మాటల్లో కాకుండా చేతల్లో ‘మేమున్నాం’ అనే భరోసాను కల్పించేలా మహిళా బ్లూ కోల్ట్స్ సిద్ధమయ్యారని హర్షం వ్యక్తం చేశారు.
‘విజిబుల్ పోలీసింగ్’లో భాగంగా మహిళా బ్లూ కోల్ట్స్ వీధుల్లో గస్తీ నిర్వహించడం వల్ల ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో భద్రతాభావం రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది రెట్టించిన ఉత్సాహంతో విధుల్లో చేరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీంరావు, ఏసీపీలు శ్రీనివాస్ జి, వేణుగోపాల్, మాధవి, కరాటే మాస్టర్ వసంత్ కుమార్, ఇతర ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
శిక్షణలోని ముఖ్యాంశాలు:
-అన్ ఆర్మ్డ్ కంబాట్ (కరాటే): ఆత్మరక్షణతో పాటు ఆపదలో ఉన్న పౌరులను రక్షించే మెళకువలు.
-నిరసనల నిర్వహణ: ధర్నాలు, ఆందోళనల సమయంలో మహిళా నిరసనకారులను మానవీయంగా, సమర్థవంతంగా అదుపు చేసే విధానాలు.
-సంపూర్ణ ఆరోగ్యం: విధి నిర్వహణలో ఒత్తిడిని జయించేందుకు ’స్ట్రెస్ మేనేజ్మెంట్’, ఆరోగ్య -పరీక్షలు, న్యూట్రిషన్ ఫు్డ క్లాసెస్ మరియు ఆర్థిక నిర్వహణపై నిపుణులతో అవగాహన.

