Tuesday, July 21, 2026
Homeవార్తలుస్థానిక ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి.. PC ఆదేశాలు

స్థానిక ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి.. PC ఆదేశాలు

కరీంనగర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉండాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశించారు. మంగళవారం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ఎన్నికల సన్నద్ధత, శాంతిభద్రతల పరిరక్షణపై పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. గత ఎన్నికల సమయంలో కోడ్‌ను ఉల్లంఘించిన వారిని, పాత నేరస్తులను గుర్తించి వారిని వెంటనే బైండోవర్ చేయాల‌ని చెప్పారు. కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ కలిగిన తుపాకులను వెంటనే ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయించుకోవాలని సూచించారు. గ్రామాల్లో బెల్టు షాపులను పూర్తిగా నిలిపివేయాలని, అక్రమ మద్యం రవాణా, నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించాల‌ని చెప్పారు.

స్థానిక ఎస్.హెచ్.ఓలు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను, స్టేషన్లను స్వయంగా సందర్శించి, అక్కడ ఉన్న వసతులు, భద్రత‌ అంశాలను పరిశీలించాల‌ని ఆదేశించారు. గ్రామ పోలీస్ అధికారుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాల‌ని, గ్రామాల్లో పోలీసుల సంచారం పెరిగేలా చర్యలు తీసుకోవాల‌ని చెప్పారు. ఎన్నికల దృష్ట్యా ఎక్కడైనా చిన్న సమస్య తలెత్తినా వెంటనే స్పందించి, తక్షణమే చర్యలు తీసుకోవాల‌న్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికలను విజయవంతం చేసేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు.

క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ ఏసీపీ కార్యాల‌యం త‌నిఖీ
గంజాయి , ఇసుక, పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను సీపీ ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ రూరల్ డివిజన్ ఏసీపీ కార్యాలయాన్ని ఆయ‌న తనిఖీ చేశారు. డివిజన్ పరిధిలోని శాంతి భద్రతలు, క్రైమ్ రేటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యాలయంలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను, వాటికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తును వేగవంతం చేసి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ వారెంట్లను వెంటనే అమలు చేయాలన్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. ప్రతి నెలా వారి తాజా సమాచారాన్ని సేకరించి నమోదు చేసుకోవాలని సూచించారు.

తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ‘బ్లాక్ స్పాట్స్’గా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల బారిన ప్రజలు పడకుండా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో రూరల్ ఏసీపీ విజయ కుమార్, కరీంనగర్ రూర‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్ నిరంజన్ రెడ్డి, తిమ్మాపూర్‌ ఇన్‌స్పెక్ట‌ర్ స‌దన్ కుమార్, కొత్త‌ప‌ల్లి ఇన్‌స్పెక్ట‌ర్ బిల్లా కోటేశ్వర్, చొప్ప‌దండి ఇన్‌స్పెక్ట‌ర్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు