Tuesday, July 21, 2026
Homeరాజకీయాలురైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం:మాజీ మంత్రి కొప్పుల

రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం:మాజీ మంత్రి కొప్పుల

TG:పత్తి పంట కొనుగోలు విషయంలో కేంద్రాన్ని ఒత్తిడికి గురి చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర విమర్శలు చేశారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఎదుట బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, పత్తి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈశ్వర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అనేకసార్లు ఢిల్లీకి వెళ్లినా, రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్‌, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఉన్నా పత్తి సాగు సంక్షోభంపై కేంద్రం దృష్టి ఆకర్షించడంలో పూర్తిగా విఫలమయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ సీజన్లో 43.38 లక్ష ఎకరాల్లో పత్తి సాగు జరిగినప్పటికీ, నెలరోజుల్లో ప్రభుత్వం 28 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం పెట్టుకోగా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేవలం 1.12 లక్షల టన్నులు మాత్రమే కొన్నదని తెలిపారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసేవారని, ఇప్పుడు దానిని 7 క్వింటాళ్లకు తగ్గించడం రైతులపై తీవ్రమైన భారమైందని అన్నారు.

తేమ శాతం పేరుతో సీసీఐ కఠిన నియమాలు పెట్టడం, జిన్నింగ్‌ మిల్లులు అవకతవకల పేరుతో కొనుగోళ్లు నిలిపివేయడం, రవాణా ఖర్చులు రెట్టింపవడం, అన్ని కలిసి రైతులను నట్టేట ముంచుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ పత్తి దిగుమతులపై 11శాతం సుంకాన్ని ఎత్తివేసి కేంద్రం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. ప్రస్తుతం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 8110 ఉన్నా, మార్కెట్లో రైతులు కేవలం రూ. 6000–7000 మాత్రమే పొందుతున్నారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మాట్లాడుతూ, పత్తి కొనుగోలు అంశంలో కేంద్రం నిరసనపై స్పందించకపోతే రాష్ట్రంలోని కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల ఓట్లతో పదవిలోకి వచ్చి, ప్రజల సమస్యలపై మౌనం వీరి నైతిక హక్కును ప్రశ్నిస్తున్నదన్నారు. కేంద్రంతో సఖ్యత పేరిట రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పక్కన పెట్టడం దారుణమని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం మానుకుని రైతుల పక్షాన నిలబడాలని, చిత్తశుద్ధి ఉంటే ఎంపీలు రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

రైతుల పంటను సమయానికి కొనుగోలు చేయడం, కనీస మద్దతు ధర అందించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అయితే, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్‌లకు రెడ్ కార్పెట్ పరుస్తూ రైతులను అగాధంలోకి నెట్టేశాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి,మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌,పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు