TG:CPIML మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో CPIML మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల హామీతో పాటు, అనేక వాగ్దానాలు చేసి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. రెండేండ్లు దాటి ముచ్చటగా మూడో ఏట ప్రవేశించే సందర్భాన డిశంబర్ 9న సంబరాలు జరుపుకోబోతున్నది. సంబరాలు అంబరాన్ని తాకొచ్చేమో! కానీ ప్రజల బతుకులు మాత్రం మారలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలు అమలు కాలేదు. గ్యారంటీలకు వారంటు లేకపోతే ఎలా? ఇందిరమ్మ ఇండ్లు, ఆడ బిడ్డలకు రూ.2500, వృద్ధాప్య, వితంతువుల పెన్షన్లను 4000కు పెంచడం, వికలాంగుల 3 వేల నుండి 6 వేల రూపాయల పెంపు, రైతు రుణాల రద్దు, ఆటో కార్మికులకు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12 వేల, జీవన భృతి, నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి, పంటలకు బోనస్ సకాలంలో చెల్లించడం ఇవన్నీ అమలుకు నోచుకోలేదు.
అలానే అకాల వర్షాలతో పత్తి, వరి, మొక్కజొన్న, సోయా తదితర పంటలు తడిసి పోయాయి. అసలే దిగుబడి తక్కువ. పైగా పత్తిని సీసీఐ కొనుగోలు చేయడానికి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నది. పత్తి నల్లబడిందని, తేమ శాతం ఎక్కువ వుందని కొనుగోలు నిరాకరిస్తున్నారు. ఇదంతా రైతును మార్కెట్లో తక్కువగా అమ్ముకునేలా చేయడానికే, ఆ తరువాత సీసీఐ అధికారులు దళారులతో కుమ్మక్కై భాగం పంచుకుంటారు. సీసీఐ కొనుగోళ్ళు ఆలస్యంగా ఆరంభించడమే అన్యాయం. పైగా కేంద్ర ప్రభుత్వం అమెరికా ఆంక్షలకు తలొగ్గి మన మార్కెట్లోకి అమెరికా పత్తి దిగుమతులపై వున్న 11 శాతం సుంకాలను డిసెంబర్ వరకు ఎత్తి వేసింది. మన పత్తికి రేటు రాకుండా చేసి, అమెరికా పత్తిని దిగుమతి చేసుకోవడం రైతాంగానికి ద్రోహం చేయడమే. అలానే తడిసిన అన్ని రకాల పంటలను కొనుగోలు చేయా లని ఆర్ గ్యారంటీల అమలుకు కృషి చేయాలని డిమాండ్ కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ డి వేణుకు సమర్పించారు.
ఈ ధర్నాలో CPIML మాస్ లైన్ ప్రజాపంథా పెద్దపెల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, అంతర్గాం మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, జిల్లా నాయకులు ఈసంపల్లి రాజేందర్, ఆడేపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య, కోడిపుంజుల లక్ష్మి, పెండ్యాల రమేష్, మార్త రాములు పుల్లూరి నాగభూషణం తూళ్ళ శంకర్, తీగుట్ల రాములు, కలువల రాయమల్లు, తోపాటు అరుణోదయ కళాకారులు రామస్వామి ఓదెలు తో పాటు 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

