Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుకేంద్రంపై నిరంతర ఉద్యమాలకు సిద్ధం కావాలి: చాడ

కేంద్రంపై నిరంతర ఉద్యమాలకు సిద్ధం కావాలి: చాడ

TG: అబద్ధాల పునాదులపై ఏర్పడ్డ బీజేపీ ప్రభుత్వం దేశంలోని సంపదనంతా కార్పొరేట్‌ పెట్టుబడిదారి వర్గాలకు దోచిపెడుతున్నదని, బీజేపీ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, రాజ్యాంగ, లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం ఎర్రజెండాలన్నీ ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా డిసెంబర్‌ 26న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఈనెల 15న జోడే ఘాట్‌ లో ప్రారంభమైన ప్రచార జాత సోమవారం కరీంనగర్‌కు చేరుకున్నది. జాతాకు నాయకత్వం వహిస్తున్న జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్‌తో పాటు జాతాలో వస్తున్న రాష్ట్ర నాయకులకు పార్టీ కరీంనగర్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో పద్మనగర్‌లో ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి ఎర్ర కండువాలు కప్పి స్వాగతించారు.

అనంతరం అక్కడే సీపీఐ జెండాను సీనియర్‌ నేత చాడ వెంకటరెడ్డి ఎగురవేశారు. శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని నాయకులు నినాదాలు చేస్తూ పద్మనగర్‌ నుంచి రాంనగర్‌, మంకమ్మతోట, గీతాభవన్‌ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. గీతా భవన్‌ చౌరస్తా వద్ద పార్టీశ్రేణులను, ప్రజలనుద్దేశించి చాడ మాట్లాడుతూ దేశంలో 1925 డిసెంబర్‌ 26న కాన్పూర్‌లో సీపీఐ ఆవిర్భవించిందని, కార్మికులు, కర్షకులు, ప్రజల పక్షాన నిలబడుతూ పెట్టుబడిదారీ విధానానికి, వర్గ దోపిడీకి వ్యతిరేకంగా, అంతరాలు లేని సమ సమాజ స్థాపన కోసం ఆవిర్భవించిన పార్టీ సీపీఐ అని, వందేళ్లుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని దేశ ప్రజానీకానికి బాసటగా నిలుస్తూ, సమస్య ఎక్కడ ఉన్నా అక్కడ పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల పక్షపాతిగా ఉంటూ వస్తున్నదని తెలిపారు.

పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న మోదీ
12 ఏండ్ల నుంచీ దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పెట్టుబడి దారులకు, కార్పొరేట్‌ శక్తులకు కొమ్ము కాస్తున్నాడని, దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి, టెలికాం, రైల్వే విమానయాన సంస్థలతో పాటు అనేక సంస్థలను ప్రైవేట్‌ పరం చేసి అదానీ, అంబానీ లాంటి వారికి కట్టబెడుతూ దేశ సంపదనంతా నిర్వీర్యం చేస్తున్నాడని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ విధానాలను ఎదుర్కోడానికి దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకమై ఉద్యమాలు నిర్వహించి పాలకుల మెడలు వంచాలని, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రచించిన భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్థల పరిరక్షణ కోసం రానున్న రోజుల్లో ఎర్రజెండాలన్నీ ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

దేశానికి స్వాతంత్య్రం రాకముందే సీపీఐ ఆవిర్భావం
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్‌ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే దేశంలో సీపీఐ ఆవిర్భవించిందని, మార్క్సిజం, లెనినిజం సిద్ధాంత పునాదులపై ఏర్పడ్డ సీపీఐ నిరంతరం ప్రజోద్యమాలు నిర్వహిస్తూ ఉన్నదని, 2024 డిసెంబర్‌ 26 నుంచి 2025 డిసెంబర్‌ 26 వరకు సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని,ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 26న ఖమ్మంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, దేశం నలుమూలల నుంచి లక్షలాదిమంది తరలి వస్తారని, ఆ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో రాష్ట్ర జాతాలు పర్యటిస్తున్నాయని, కమ్యూనిస్టు శ్రేణులు ఖమ్మంలో బహిరంగ సభకు కదలి రావాలని పిలుపునిచ్చారు.

Related News

తాజా వార్తలు