TG: భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 73 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని లింగాల చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ.. 1949, నవంబర్ 26న భారత రాజ్యాంగానికి ఆమోదం లభించిందని, 1950, జనవరి 26న అమలులోకి వచ్చిందని వివరించారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ను కేవలం దళితవాడలకే పరిమితం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆరోపించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గొప్ప దేశభక్తుడని, కులమతాలకు అతీతంగా పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. అంబేద్కర్ ను కేవలం ఓటు యంత్రంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నదని ధ్వజమెత్తారు.
నిజమైన దేశభక్తుడు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే భారతదేశం ముందుకు పోతుందని స్పష్టం చేశారు. భారతదేశం కోసం పోరాడిన వాళ్లను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ స్మరించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. రామమందిరం నిర్మాణం కేవలం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పారు. దేశ ఔనత్యం, రక్షణ కోసం నరేంద్ర మోడీ అహర్నిశలూ పనిచేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ అందరివాడని చెప్పారు.
కార్యక్రమం అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, మహిళలు గువ్వల సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువాలు కప్పి గువ్వల పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు మంగ్యా నాయక్, మహిళా మోర్చా జిల్లా నాయకురాలు జానకి, రవీందర్, చందులాల్, శంకర్, రాకేష్, చందు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

