కరీంనగర్:డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ప్రధానంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా సర్పంచ్, వార్డు స్థానాలను కైవసం చేసుకోవమే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రామాల వారీగా సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై సర్వేలు చేయిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఎన్నికలను పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా నేడు హుజూరాబాద్ పట్టణంలోని మధువన్ గార్డెన్స్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యదర్శులు, సోషల్ మీడియా వారియర్స్ తో విస్త్రతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
హుజూరాబాద్ లో జరగబోయే పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు ఈ సమావేశాన్ని ద్రుష్టిలో ఉంచుకుని హుజూరాబాద్ పట్టణంలో కాషాయ శ్రేణులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పట్టణ కూడళ్లలో కాషాయ జెండాలతో అందంగా అలంకరణ చేశారు. దీంతో హుజూరాబాద్ పట్టణం కాషాయమయమైంది.
ఈ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలపై బండి సంజయ్ చర్చించనున్నారు. ఒకవైపు పంచాయతీ ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టేందుకు యాక్షన్ ప్లాన్ ను కూడా ప్రకటించనున్నారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనా విజయోత్సవాల పేరుతో ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా, అందుకు భిన్నంగా కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు జరిగిన అన్యాయాలపై కరపత్రాలను రూపొందించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణను రేపటి సమావేశంలో ప్రకటించనున్నారు.

