Tuesday, July 21, 2026
Homeవార్తలుఈ రోడ్డుపై కంకరరాళ్లు..ప్రయాణికుల పాలిట యమకింకరులే!

ఈ రోడ్డుపై కంకరరాళ్లు..ప్రయాణికుల పాలిట యమకింకరులే!

బెజ్జంకి: ఇక డబుల్‌ రోడ్ వస్తుంది.. తమకు రవాణా కష్టాలు తీరిపోతాయనుకున్న ఇక్కడి ప్రజల ఆశలపై సర్కారు నీళ్లుచల్లింది.రెండేండ్ల నుంచి బెజ్జంకి-బేగంపేట డబుల్‌ రోడ్డు పనులను పూర్తిచేయకపోవడంతో కంకర రోడ్డుపై ప్రయాణం నరకాన్ని తలపిస్తున్నది. బిల్లులు రాలేదన్న సాకుతో పనులను కాంట్రాక్టర్‌ మధ్యలోనే వదిలేయడం రెండు మండలాల ప్రజల పాలిట శాపంగా మారింది. బెజ్జంకి నుంచి బేగంపేట వరకు చేపట్టిన డబుల్‌ రోడ్డు పనుల బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ పట్టించుకోవడం లేదు. కంకర పోసి వదిలేయడంతో రెండేండ్లుగా ప్రయాణికులు నరక యాతన పడుతున్నారు. బెజ్జంకి నుంచి బేగంపేట వరకు డబుల్‌ రోడ్డు వేసేందుకు రూ.6 కోట్లతో 2022 ఏడాది చివరలో పనులను ప్రారంభించారు.

రహదారి వెడల్పు, మట్టి చదును, కంకరపోసే పనులు చేశారు. సుమారు 7 కిలోమీటర్ల మేర కంకర పోశారు. 2023 ఆగస్టులో తారు వేసే పనులు మొదలుపెట్టగా 5 కిలోమీటర్ల మేర పూర్తయింది. బేగంపేట వరకు మరో 2 కిలో మీటర్లు పూర్తి చేయాల్సి ఉండగా బిల్లులు రాలేదని కాంట్రాక్టర్‌ నిలిపివేశాడు. రహదారిపై కంకర కుప్పలు, లోతైన గుంతలు, అసంపూర్తి పనులు ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది గాయాలపాలయ్యారు. ఇక వర్షాకాలంలో కష్టాలు చెప్పనలవికాకుండా ఉన్నాయి. బేగంపేట, గూడెం, వడ్లూర్‌, లక్ష్మీపూర్‌, తలారివాని పల్లి, సమీప గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి చేరుకోవడానికి ఈ రోడ్డు నుంచే ప్రయాణిస్తారు.

కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి బెజ్జంకి నుంచి రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు ఈ రోడ్డు నుంచే వెళ్తాయి. కొత్త మండలం గన్నేరువరం సమీప గ్రామాల ప్రజలు బెజ్జంకికి రావాలంటే ఈ దారే గతి. దీనిపై ప్రయాణం నరకప్రాయం కావడంతో బేగంపేట గ్రామస్తులు పలుమార్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం పట్టించుకొని రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. తాజాగా పరిసర గ్రామాల ప్రజలు, బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనలకు సిద్ధమయ్యారు.

Related News

తాజా వార్తలు