పెద్దపల్లి:తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు వచ్చేంత వరకు తమ ఉద్యమం ఆగదని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ కమిటీ నిర్మాణ సమావేశం మంగళవారం జిల్లా కేంద్రంలోని మూన్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది.
ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం సాధించాలన్న సంకల్పంతోనే బీసీ జేఏసీని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారన్నారు. ఆ బాధ్యతలో భాగంగా పెద్దపల్లి జిల్లా చైర్మన్‌గా తమను నియమించారని తెలిపారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీల వారీగా 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చేసిన ప్రకటనను ఆమె తీవ్రంగా విమర్శించారు. “గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉంటాయా? ఉండవు. అలాంటప్పుడు పార్టీల వారీగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?” అని ప్రశ్నించారు.
అలాగే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 27శాతం బీసీ రిజర్వేషన్లు కూడా పూర్తిగా అమలు కాకపోవడానికి కోర్టు తీర్పులే కారణమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు, ఐఐటీల్లో ఓసీ వర్గానికి అధిక ప్రాధాన్యం ఉండటం వల్ల తీర్పులు కూడా తమకనుకూలంగా రావడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏళ్ల తరబడి బీసీలు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నా న్యాయం జరగలేదని, అయితే ఎవరూ అడగకుండానే ఓసీ వర్గానికి 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ వంటి నాయకులు చేసిన పోరాటాలను గుర్తుచేసిన ఆమె, గతంలో బీసీలకు మద్దతు ఇస్తామని చెప్పిన రాజకీయ పార్టీలు ఇప్పుడు మౌనం వహించడాన్ని తప్పుపట్టారు.
42శాతం రిజర్వేషన్ అంశాన్ని షెడ్యూల్-9లో చేర్చేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాసరి ఉష.. రానున్న రోజుల్లో బీసీ జేఏసీ ఉద్యమాన్ని మరింత బలపరుస్తామని స్పష్టం చేశారు. “మన 42శాతం వాటా వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తాం” అని హెచ్చరించారు.
సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెళ్లి శంకర్, వైస్ చైర్మన్ కొండి సతీష్, కన్వీనర్ సలేంద్ర కొమరయ్య యాదవ్, మంద భాస్కర్ యాదవ్, మీడియా ఇన్‌చార్జ్ అబ్దుల్ మాలిక్, నోమూరి శ్రీధర్, బొడ్డుపల్లి లక్ష్మణ్, యుగేందర్, నార్ల అంజయ్య, గొల్లపల్లి రాజమల్లు, బొంకూరి ఐలయ్య, ఏ.అరుణ, శారద, రవీందర్, తమ్ముడబోయిన రాజ్‌కుమార్ యాదవ్, కందుల సదాశివ్, అలువాల రాజేందర్, బోడగుంట సుభాష్, బొంగోని సదయ్య గౌడ్, కన్నం రమేష్, మహేష్, సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

