TG:పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి స్టేడియం స్విమ్మింగ్ పూల్‌లో 69వ రాష్ట్రస్థాయి అండర్ 14 బాల బాలికల స్విమ్మింగ్ పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.రాష్ట్ర మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి.జన ప్రసాద్, ఏసిపి మడత రమేష్ పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఆటలు క్రమశిక్షణ, మంచి అలవాట్లు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు క్రీడలు తోడ్పడతాయని, తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రతి పాఠశాలలో ఒక ఆటల పీరియడ్‌ను తప్పనిసరి చేసినట్లు చెప్పారు.
ఆర్జీ-3 జనరల్ మేనేజర్ సుధాకర్ రావు మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలోని స్టేడియంలో సమాజ అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలను అందిస్తున్నామని తెలిపారు. ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ ఆసంపల్లి వాసు పెద్దపల్లి జిల్లాలో అన్ని రకాల క్రీడలకు తమ ఫౌండేషన్ నుండి నిరంతర సహకారం అందిస్తామని అన్నారు. ఐఎన్టీసీ నాయకులు పైసల్ శ్రీనివాస్ స్విమ్మింగ్ నిర్వహణలో చూపిన చొరవను ఏసిపి అభినందించారు.
ఎస్జీఫ్ జిల్లా సెక్రటరీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మొదటిసారిగా రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలను పెద్దపల్లి జిల్లాకు తీసుకురావడం గర్వకారణమని, రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రస్థాయి పోటీలను కూడా ఇక్కడ నిర్వహించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సింగరేణి జీఎంకు అలాగే ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి అక్కపాక సురేష్,ప్రకాశం రాష్ట్ర బాధ్యులు శోభారాణి, కే. శ్రీనివాస్, పేట సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సురేందర్, దాసరి రమేష్, టోర్నమెంట్ అబ్జర్వర్ ఆర్. శ్రీనివాస్, టెక్నికల్ అధికారులు శశికుమార్, శ్రీకాంత్, వ్యాయామ ఉపాధ్యాయులు శైలజ, మాధవి, జావీద్, వెంకటేష్, దుర్గాప్రసాద్, ఖాజాబీ, రేణుక, సతీష్, ఎం. శ్రీనివాస్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

