Tuesday, July 21, 2026
Homeవార్తలుసినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా ఒడిశా సంగీత రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒడియా ప్లేబ్యాక్ సింగర్ హ్యూమాన్ సాగర్ (36) కన్నుమూశారు. ఆయన అకాల మరణం సంగీత ప్రియులను, సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.

సాగర్ గత మూడు రోజులుగా భువనేశ్వర్‌లోని AIIMS ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ద్వైపాక్షిక న్యుమోనియా, అక్యూట్ లివర్ ఫెయిల్యూర్, డైలేటెడ్ కార్డియోమయోపతి, మల్టీ-ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఆయన పోరాడారు. ఆదివారం రాత్రి 9:08 గంటలకు ఆయన మరణించినట్లు ఆస్పత్రి అధికారికంగా ధృవీకరించింది. అత్యంత అధునాతన చికిత్స అందించినప్పటికీ, ఆయన శరీరం స్పందించలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

సంగీత ప్రస్థానం:బలసోర్‌లో సాధారణ కుటుంబంలో జన్మించిన హ్యూమాన్ సాగర్, ఒడియా ప్లేబ్యాక్ సింగర్‌గా అనతికాలంలోనే ప్రసిద్ధి చెందారు.ఆయన ‘సిందూర’, ‘ఇష్ఖ్ హువా’, ‘బిన్ బలా’ వంటి అనేక సూపర్ హిట్ పాటలతో ప్రేక్షకులను అలరించారు.దాదాపు 100కు పైగా పాటలు పాడిన ఆయన… జానపద (ఫోక్), సమకాలీన (కాంటెంపరరీ) శైలులను కలిపి తనదైన ముద్ర వేశారు.

ప్రముఖుల సంతాపం:సాగర్‌ మరణం పట్ల ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజ్హీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇది ‘సంగీతం, చిత్రపరిశ్రమకు తీవ్ర నష్టం’గా ఆయన అభివర్ణించారు. అలాగే సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు, కళాకారులు ఆయన పాటలు, ప్రదర్శనలను షేర్ చేస్తూ తమ దుఃఖాన్ని తెలియజేస్తున్నారు. హ్యూమాన్ సాగర్ మరణంతో ఒడియా సంగీత రంగంలో ఒక శకం ముగిసినట్లైంది.

Related News

తాజా వార్తలు