రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వ మద్దతు ధరను తప్పక పొందాలని వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు అన్నారు. సోమవారం ఆయన గ్రామీణ మండల పరిధిలోని నమిలిగుండుపల్లి ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియను, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని వ్యవసాయ అధికారులను, సిబ్బందిని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా, తేమశాతం నిబంధనలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
రైతులు తమ పంటను కేంద్రానికి తీసుకువచ్చిన తర్వాత వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, బస్తాలను నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను కూడా రైతులకు సకాలంలో చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే గ్రామీణ స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర అందిస్తోందని చైర్మన్ రొండి రాజు తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా కేంద్రాలలోనే ధాన్యం అమ్మి లాభపడాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గురించి, కొనుగోలు కేంద్రాల నిర్వహణ గురించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, కొనుగోలు కేంద్రం సిబ్బంది, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

