Tuesday, July 21, 2026
Homeవార్తలుఅర్ధ‌రాత్రి సీపీ గ‌స్తీ.. రాత్రంతా బందోబ‌స్తు!

అర్ధ‌రాత్రి సీపీ గ‌స్తీ.. రాత్రంతా బందోబ‌స్తు!

TG: మంగళవారం రాత్రి 10:00 గంటల నుంచి బుధ‌వారం వేకువ‌జాము వ‌ర‌కు కరీంనగర్ పట్టణ డివిజన్ పరిధిలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్వయంగా గస్తీ నిర్వహించారు. పీపుల్స్ వెల్ఫేర్ పోలీసింగ్ చొరవ కింద రాత్రిపూట భద్రత, జవాబుదారీతనం, పౌర భద్రతను మెరుగుపరచడంలో భాగంగా ఇలా గ‌స్తీని ప‌ర్య‌వేక్షించారు. క‌రీంనగర్ వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్ల నివాసాలను సందర్శించారు. వారి గత నేర చరిత్ర, ప్రస్తుత వృత్తి,జీవనశైలి గురించి అడిగి తెలుసుకున్నారు. తిరిగి నేర కార్యకలాపాలకు పాల్పడటానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని గడపాలని, సమాజంలో బాధ్యతాయుతమైన సభ్యులుగా మారాలని సూచించారు.

తెలంగాణ చౌక్, కమాన్, కోతిరాంపూర్, గణేష్ నగర్ వంటి ప్రాంతాల్లో ప్రధాన రోడ్లు, కీలక జంక్షన్లు, సున్నితమైన ప్రదేశాలను పరిశీలించారు. హోటళ్లు, దుకాణాల యజమానులతో మాట్లాడి, అనుమతి పొందిన గంటలకు మించి పనిచేయవద్దని హెచ్చరించారు. గ‌స్తీ విధుల్లో ఉన్న అధికారులతో వ్యక్తిగతంగా సంభాషించారు. పెట్రోల్ పాయింట్లు, ప్రతిస్పందన సమయాలు, రోడ్లపై మద్యం సేవించి వాహనాలు నడపడం, అనుమానిత వ్యక్తుల తనిఖీలు, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ పరికరంతో వేలిముద్రలు, సమస్య పరిష్కార ప్రక్రియలను సమీక్షించారు. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జనరల్ డైరీ, రాత్రి ఎంట్రీలు, డ్యూటీ రోస్టర్లు, హాజరు రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాత్రిపూట పోలీసింగ్ను మెరుగుపరచడానికి త‌నిఖీ చేసిన‌ట్టు చెప్పారు. జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం, ప్రతిస్పందనను మెరుగుపరచడం, రాత్రి వేళల్లో పౌరుల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా ఈ క్షేత్ర సందర్శనలు చేపడుతున్నామన్నారు. అధికారులు, సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ను నిర్వహించాలని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రాంచందర్ రావు (వన్ టౌన్ ), సృజన్ రెడ్డి (రెండో ఠాణా), రిజర్వు ఇన్స్పెక్టర్ కిరణ్ తో పాటు పెట్రోలింగ్ అధికారులు, బ్లూ కోల్ట్స్, క్విక్ రియాక్షన్ టీం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు