TG: 42శాతం రిజర్వేషన్ల పేరిట బీసీలను కాంగ్రెస్ నిండా మోసం చేసిందని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. 42శాతం కోటా అని చెప్పి తీరా పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 17 శాతమే రిజర్వేషన్లు కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు దేశంలో ఇంతకంటే అన్యాయం మరే ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు దీక్షాదివస్ స్ఫూర్తితో మరో ఉద్యమం చేపడుదామని పిలుపునిచ్చారు. 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సన్నాహక భేటీల్లో భాగంగా వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల పార్టీ కార్యాలయాల్లో బుధవారం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్ మాట్లాడారు.
విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు వాటా ఇస్తానని, లక్ష కోట్ల బడ్జెట్ పెడతానన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అదే బీసీలను నమ్మించి గొంతుకోసిందని మండిపడ్డారు. ప్రజలపై, బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తూ కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నదని నిప్పులు చెరిగారు. ప్రజలకు, కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 16 ఏండ్ల కింద కేసీఆర్ తెలంగాణ వచ్చుడో-కేసీఆర్ సచ్చుడో అని 2009 నవంబర్ 29న దీక్షకు చేసేందుకు కరీంనగర్లో బయలుదేరి సిద్దిపేటకు వెళ్లే క్రమంలో పోలీసులు అరెస్టు చేసి వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తీసుకెళ్లడం ఇంకా తన కండ్ల ముందు కనిపిస్తున్నదని చెప్పారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ ఉద్యమం గురించి ఈతరం పిల్లలకు తెలియదని, దీక్ష దివస్ సందర్భంగా ఇప్పటి వాళ్లకు అవన్నీ తెలియజెప్పాలని సూచించారు. కేసీఆర్ దీక్ష, అమరుల త్యాగాలు, శ్రీకాంతాచారి అమరత్వం, విద్యార్థులు, ఉద్యోగులు, జర్నలిస్టుల పోరాటాన్ని మళ్లీ తలుచుకోవాలని చెప్పారు. నవంబర్ 29న దీక్షాదివస్‌ను ఘనంగా జరుపుకోవాలని పిలపునిచ్చారు. కాంగ్రెస్ సర్కార్ బీసీలను దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను ఆరు నెలల్లో అమలు చేస్తామని నమ్మబలికి బీసీల ఓట్లు వేయించుకొని గెలిచిందని, రెండేండ్లు గడుస్తున్నా 42% రిజర్వేషన్లు అమలు చేయడం లేదని విమర్శించారు. బీసీలకు 42 శాతమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతమే ఇచ్చి ధోకా చేసిందన్నారు.
కార్యక్రమాల్లో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, డీఎస్ రెడ్యానాయక్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, బానోతు శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, ఎం సుధీర్‌కుమార్, సాంబారి సమ్మారావు, బడే నాగజ్యోతి, నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, కే వాసుదేవారెడ్డి, బీఆర్ ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

