Tuesday, July 21, 2026
Homeవార్తలుమానేరు వాగు చెక్ డ్యామ్ ఘటనపై సమగ్ర విచారణ

మానేరు వాగు చెక్ డ్యామ్ ఘటనపై సమగ్ర విచారణ

​TG:కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, జమ్మికుంట పట్టణ పరిధిలోని తనుగుల గ్రామ శివారులో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ దెబ్బతిన్న ఘటనపై జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సీరియస్‌గా స్పందించింది. సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సంయుక్తంగా ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈనెల 21న రాత్రి సమయంలో ఈ చెక్ డ్యామ్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన నీటి ప్రవాహానికి సహజంగా జరిగిందా? లేక ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా విధ్వంసానికి పాల్పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శాస్త్రీయ విచారణ- క్లూస్ టీం పరిశీలన:
ఘటనా స్థల పరిశీలనలో భాగంగా అధికారులతో పాటు హైదరాబాద్ నుండి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్ రాజ్ నేతృత్వంలోని బృందం, కరీంనగర్ క్లూస్ టీం సభ్యులు, మరియు ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్లు రాజు, స్వర్ణజ్యోతి అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

​ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. “ఈ ఘటనకు గల అసలు కారణాలను వెలికితీయడానికి పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నాం. సాంకేతిక నిపుణుల సహకారంతో అక్కడి నుండి నమూనాలు సేకరించాము. వీటిపై ప్రయోగశాలలో అవసరమైన పరీక్షలు నిర్వహించి, సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాము” అని తెలిపారు.

​నివేదిక ఆధారంగా ఎవరైనా బాధ్యులని తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో హుజురాబాద్ ఏసీపీ మాధవి,పెద్దపల్లి ఏసీపీ కృష్ణ,ఇన్స్పెక్టర్లు రామకృష్ణ గౌడ్,లక్ష్మీనారాయణ లతో పాటు ఎస్సైలు శేఖర్ రెడ్డి,ఆవుల తిరుపతి,నీటి పారుదల శాఖ అధికారులు,ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు