Tuesday, July 21, 2026
Homeవార్తలుఎట్టకేలకు కల్వర్టు పనులు.. దిగొచ్చిన ప్రభుత్వం

ఎట్టకేలకు కల్వర్టు పనులు.. దిగొచ్చిన ప్రభుత్వం

కరీంనగర్‌ : గన్నేరువరం మండలం జంగపల్లి-హన్మాజిపల్లి రోడ్డు మధ్యలో కల్వర్టు పనులు ప్రారంభమైనట్టు కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మెర రవీందర్‌రెడ్డి తెలిపారు. కాగా ప్రజల ఆందోళనలు, బీఆర్‌ఎస్‌ నేతల హెచ్చరికలతోనే కల్వర్టు నిర్మాణం మొదలైందని స్థానికంగా చర్చించుకుంటున్నారు.

‘ప్రజల ప్రాణాలంటే పట్టింపులేదా? కల్వర్టుపై బ్రిడ్జి ఇంకెప్పుడు కడుతరు?’ అంటూ జంగపల్లి గ్రామస్తులు, రైతులు కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. శిథిలమైన కల్వర్టును తాత్కాలికంగా పైపులు వేసి మట్టి పోసి వదిలి వేయడం వల్ల వర్షాలకు కుంగిపోయి హార్వెస్టర్లు, స్కూల్‌ బస్సులు, వడ్ల లారీలు దిగబడిపోతున్నాయని చెప్పారు. మండల కేంద్రానికి వెళ్లే దారిపై రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం జంగపల్లి ఎక్స్‌ రోడ్డు వద్ద ఉండడం మూలంగా వడ్ల తరలింపునకు ఈ కల్వర్టు అడ్డంకిగా మారడంతో డబుల్‌ రోడ్డు నిర్మాణం సంగతేమో? గాని, కనీసం కల్వర్టుల వద్ద బ్రిడ్జిలనైనా ముందుగా నిర్మించి తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. కల్వర్టుల నిర్మాణంపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టి పెట్టాలని, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొని రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని కోరారు. దీంతో ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం కల్వర్టు నిర్మాణం శనివారం మొదలుపెట్టింది.

Related News

తాజా వార్తలు