కరీంనగర్: ఆలయాలు స్ఫూర్తి కేంద్రాలని శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి చెప్పారు. గన్నేరువరం మండలంలోని కాసింపేట స్వయంభూ మానసాదేవి ఆలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. మనసాదేవి, అపురూప లక్ష్మి, సీతారామ ఆంజనేయ, గణపతి, లక్ష్మీ నరసింహ స్వామి, మహా శివుడు, 108 శివలింగాలు, జంటనాగులను ఆయన దర్శించుకున్నారు. శ్రీ చక్రానికి కుంకుమార్చన, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భక్తి భావంతో దేవాలయాలను సందర్శించాలని, కోరికలు తీర్చుకోవడానికి సందర్శించరాదని చెప్పారు. సంప్రదాయబద్ధంగా ఉండి ఆలయ ప్రవేశం చేయాలని, భగవత్ నామస్మరణతో మనిషిలో పరివర్తన తప్పక వస్తుందని తెలిపారు. తొలిసారిగా ఆలయ సందర్శనకు వచ్చిన విద్యారణ్య భారతి స్వామిని ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికి సన్మానించారు. స్వామి వారు ఆలయానికి రావడం అదృష్టమని ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.

