Wednesday, July 22, 2026
Homeవార్తలుఎడారి దేశంలో ఆగిన గుండె.. సహాయం కోసం..!

ఎడారి దేశంలో ఆగిన గుండె.. సహాయం కోసం..!

-సౌదీలో గుండెపోటుతో హన్మాజీపల్లి వాసి దుర్మరణం
-వీరయ్య మృతితో కుటుంబం కన్నీరుమున్సీరు
-మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహాయం కోసం ఎదురుచూపులు

గన్నేరువరం: ఎడారి దేశంపై ఎన్నో ఆశలు పెట్టుకొని వెళ్లిన వలస జీవి గుండె హఠాత్తుగా ఆగిపోయింది. గల్ఫ్‌లో కష్టపడి తన కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టుకుందామనుకున్న అతడి కలలు అంతలోనే కల్లలయ్యాయి. పది నెలల క్రితమే తమను విడిచి విదేశానికి వెళ్లిన ఇంటి పెద్ద మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నది. ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకొని దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోయిన తన భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని అతడి భార్య అనిత దీనంగా వేడుకుంటున్నది.

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం హనుమాజీపల్లి గ్రామానికి చెందిన పారునంది వీరయ్య (44) సౌదీ అరేబియాలో గుండెపోటుతో చనిపోయారు. జీవనోపాధి కోసం సౌదీలోని సకాకలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరయ్య అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వీరయ్య మృతితో కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఎవరైనా సహాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు, బంధువులు వేడుకుంటున్నారు.

వీరయ్య, అనిత దంపతులకు ఇద్దరు కొడుకులు కాగా, పది నెలల క్రితమే వీరయ్య ఇంటికి వచ్చి తిరిగి సౌదీ వెళ్లాడు. ఇంతలోనే అతడు గుండెపోటుతో చనిపోవడంతో కుటుంబసభ్యులు గుండెలు బాదుకుంటున్నారు.

Related News

తాజా వార్తలు