గన్నేరువరం : గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు మంజూరై మూడేండ్లు గడుస్తున్నా.. ఇంకా పనులు పూర్తికాకపోవడాన్ని నిరసిస్తూ.. నెలరోజుల్లోగా రహదారి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై ఆదివారం మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా విజయవంతమైంది. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు వందలాదిగా చేరుకొని ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘రోడ్డు వేస్తారా? ప్రజల ప్రాణాలు తీస్తారా?’ అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ధర్నాలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, రైతు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సర్కారు వైఖరిని తూర్పారబట్టారు.
మాజీ జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ గన్నేరువరం మండల అధ్యక్షుడు గంప వెంకన్న, బీఆర్ఎస్ గన్నేరువరం మహిళా అధ్యక్షురాలు కూసుంబ నవీన, బీజేపీ గన్నేరువరం మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు సొల్లు అజయ్ వర్మ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, పుల్లెల జగన్, ఏలేటి చంద్రా రెడ్డి, పుల్లెల రాము, సీపీఐ నాయకులు చొక్కాల శ్రీశైలం, కాంతలా అంజి రెడ్డితో పాటు యువజన నాయకులూ గూడూరి సురేష్, తాడూరి వంశీ కృష్ణ తదితరులు ధర్నాలో పాల్గొని ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డును పూర్తి చేయకుండా ప్రమాదాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తిపోశారు. ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకుడు నాగరాజు మాట్లాడుతూ గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు రూ.71 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరై మూడేండ్లు గడుస్తున్నా రోడ్డు పనులు పూర్తి కాలేదని, కాంట్రాక్టర్ కంకర పోసి వదిలేయడంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే కల్వంపల్లి సత్యనారాయణకు ఎన్నిసార్లు విన్నవించినా రోడ్డు సమస్యను పట్టించుకున్న పాపాన పోవడం లేదని, నాయకులకు, అధికారులకు కనువిప్పు కలిగేలా రోడ్డు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకపోవాలనే ఉద్దేశంతో ఈ మహాధర్నా నిర్వహించినట్టు తెలిపారు. డబుల్ రోడ్డు పూర్తిచేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. మహాధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు వచ్చి లాఠీలతో చెదరగొట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమను ఏం చేసినా ఆందోళనను విరమించేది లేదని నేతలు తేల్చిచెప్పారు. చివరికి పోలీసులు సముదాయించి ధర్నాను విరమింపజేశారు.
రోడ్డుపై ఇంకెన్నిరోజులు రాజకీయాలు?:మాజీ జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి
గుండ్లపల్లి, పొత్తూరు డబుల్ రోడ్డును 2023 ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం అప్పటి కాంగ్రెస్ నేత కవ్వంపల్లి సత్యనారాయణ వాడుకున్నారని, మండలంలోని యువకులను ఎగదోసి ఆందోళనలు చేయించారని, ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసి ఓట్లు వేయించుకున్నారని మాజీ జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి మండిపడ్డారు. ధర్నాలో ఆయన మాట్లాడుతూ తను ఎమ్మెల్యేగా గెలిస్తే వంద రోజుల్లో డబుల్ రోడ్డును పూర్తి చేయిస్తానన్న కవ్వంపల్లి సత్యనారాయణ, గెలిచి రెండేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్డుకు రూ.70 కోట్లు కేటాయించి పనులను ప్రారంభిస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ రోడ్డును వాడుకొని అధికారంలోకి రాగానే వదిలేసిందని దుయ్యబట్టారు.
ప్రజల ఇబ్బందులు కనిపిస్తలేవా?:బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న
కవ్వంపల్లి గెలవక ముందు ఇంటింటికీ తిరుక్కుంట రోడ్డు లేక ఇబ్బందుల పాలవుతున్నామని చెప్పి అప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను బద్నాం చేశారని బీఆర్ఎస్ గన్నేరువరం మండలాధ్యక్షుడు గంప వెంకన్న మండిపడ్డారు. ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. జేఏసీ అని యువతను రెచ్చగొట్టి రోడ్డు పేరు చెప్పి కవ్వంపల్లి అధికారంలోకి వచ్చాడని, గెలిచి 2 ఏండ్లు గడుస్నున్నా రోడ్డు గురించి పట్టించుకునే ఆలోచన చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేగా రసమయి బాలకిషన్ ఉన్నప్పుడే నిధులు కేటాయించినా పనులు చేయించడంలో ఇప్పుడు ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ప్రశ్నించారు. రోడ్డు పనులను పూర్తి చేసేదాకా ఎమ్మెల్యే వెంట పడుతామని హెచ్చరించారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సమాధానం చెప్పాలి:కుసుంబ నవీన
అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో గుండ్లపల్లె-పొత్తూరు డబుల్ రోడ్డు పూర్తి చేయిస్తామని అప్పటి కాంగ్రెస్ నాయకుడు కవ్వంపల్లి సత్యనారాయణ ప్రగల్భాలు పలికారని, నిధులు మంజూరైన రోడ్డును అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా పూర్తి చేయలేదని బీఆర్ఎస్ గన్నేరువరం మండల మహిళా అధ్యక్షురాలు కుసుంబ నవీన మండిపడ్డారు. ఎన్నికల్లో ఈ డబుల్ రోడ్డును రాజకీయంగా వాడుకొని, యువతను, మండల ప్రజలను రెచ్చగొట్టి ఇప్పుడు మోసం చేశారని, బీఆర్ఎస్ హయాంలోనే రూ.70 కోట్లు మంజూరైనా ఇప్పటికీ రోడ్డును ఎందుకు పూర్తి చేయడంలేదో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డు పూర్తి చేయకపోవడంతో గన్నేరువరం మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రజల ప్రాణాలంటే పట్టింపులేదా?:బీజేపీ మండల అధ్యక్షుడు నికేశ్
గుండ్లపల్లి, పొత్తూరు డబుల్ రోడ్డును ఇంకెప్పుడు పూర్తి చేస్తరు? ప్రజల ప్రాణాలంటే పట్టింపులేదా? అని బీజేపీ గన్నేరువరం మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ నిలదీశారు. డబుల్ రోడ్డును కాంగ్రెస్ ఎన్నికల్లో వాడుకున్నదని, అధికారంలోకి రాగానే రోడ్డును పూర్తి చేయిస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని భగ్గుమన్నారు. రాజకీయాలకు వాడుకోవడం తప్ప ఈ రహదారిని ఎన్నడు బాగు చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేండ్లయినా ఒక్క కొత్త రోడ్డు వేసింది లేదని, కనీసం మంజూరైన రోడ్లను కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ఈ రోడ్డు ప్రమాదకరంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. రోడ్డు పనులను పూర్తి చేసేదాకా కాంగ్రెస్‌ను వదిలేది లేదని హెచ్చరించారు.
పనులు పూర్తయ్యేదాకా పోరాటం:బీజేపీ రాష్ట్ర నాయకుడు సొల్లు అజయ్‌వర్మ
గుండ్లపల్లి-పొత్తూరు డబుల్ రోడ్డు పూర్తయ్యేదాకా పోరాటం చేస్తామని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర నాయకుడు సొల్లు అజయ్ వర్మ హెచ్చరించారు. గుండ్లపల్లి వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డును కాంగ్రెస్ రాజకీయంగా వాడుకున్నదని, అధికారంలోకి రాగానే గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. లెవల్ కల్వర్టుల బ్రిడ్జిలు నిర్మించాలని, బావులు ఉన్న చోట రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మంజూరైన రోడ్డును ఇప్పటికీ పూర్తి చేయకపోవడం ఎమ్మెల్యే చేతకాని తనానికి నిదర్శమని మండిపడ్డారు. రోడ్డు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దారుణమని, ఇప్పటికైనా కవ్వంపల్లి సత్యనారాయణ ఈ డబుల్ రోడ్డుపై దృష్టిపెట్టి పనులు పూర్తిచేయించాలని, లేదంటే మున్ముందు మరిన్ని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ప్రజల ప్రాణాలతో కాంగ్రెస్ చెలగాటం:బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్
మంజూరైన గుండ్లపల్లి-పొత్తూరు డబుల్ రోడ్డును పూర్తిచేయకుండా ప్రజల ప్రాణాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతున్నదని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ విమర్శించారు. యువజన సంఘాల ధర్నాలో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన గన్నేరువరం మండలానికి రోడ్డు సరిగ్గా లేక ప్రజలు ముప్పు తిప్పలు పడుతున్నారని, అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఈ రోడ్డు గురించి ఊసెత్తకపోవడం విచారకరమని వాపోయారు. ఎమ్మెల్యే చెప్పినట్టుగా 15 రోజుల్లో పనులు ప్రారంభించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

