Wednesday, July 22, 2026
Homeవార్తలుకొండూరికి ఘన సత్కారం

కొండూరికి ఘన సత్కారం

విజయవాడలోని డీసీసీబీ రీజనల్‌ కార్యాలయంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌, తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు లిమిటెడ్‌ (టెస్కాబ్‌)మాజీ చైర్మన్‌, కరీంనగర్‌ జిల్లా కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావును శనివారం ఘనంగా సన్మానించారు. మాజీ మంత్రి, డీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ నెట్టెం రఘురాం ఆహ్వానం మేరకు కొండూరి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనను నెట్టెం రఘురాం శాలువాతో సత్కరించి, మెమెంటోను అందజేశారు. కో ఆపరేటివ్‌ రంగ అభివృద్ధికి కొండూరి అందిస్తున్న సేవలను ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డీసీసీబీ పరిధిలోని సహకార సొసైటీల ఆర్థిక బలోపేతం కోసం అవసరమైన చర్యలను వివరించారు. ప్రస్తుతం ఉన్న 40 లక్షల క్రెడిట్‌ లిమిట్‌ను పెంచాలని, తద్వారా గ్రామీణ సహకార వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. రైతులకు అందుతున్న క్రాప్‌ లోన్లపై నాబార్డ్‌ నుంచి వచ్చే పరిమితిని తగ్గించకుండా దాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి కోసం ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టులకు మరింత చేయూతనందించాలని, ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు, నిధుల కేటాయింపును బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు.

ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరుతో గుర్తింపు పొందిన కరీంనగర్‌ డీసీసీబీకి తప్పకుండా రావాలని నెట్టెం రఘురాంను కొండూరి ఆహ్వానించారు. రెండు సంస్థల మధ్య కో ఆపరేటివ్‌ రంగ అభివృద్ధికి సంబంధించిన అనుభవాలు, ఉత్తమ పద్ధతుల మార్పిడి, పరస్పర సహకారంపై చర్చించేందుకు ఈ పర్యటన ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. సమావేశం మొత్తం సానుకూల వాతావరణంలో సాగి, కో ఆపరేటివ్‌ బ్యాంకింగ్‌ రంగ భవిష్యత్తు పురోగతికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఇద్దరి మధ్య విస్తృత చర్చలు జరిగాయి. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు సీఈవో శ్యాం మనోహర్‌, సిబ్బంది పాల్గొన్నారు

Related News

తాజా వార్తలు