TG: ర్యాగింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవని పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ గోదావరిఖనిలోని సింగరేణి మెడికల్ కళాశాలలో పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, పెద్దపల్లి జోన్ షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ.. సీనియర్ విద్యార్థులు జూనియర్లకు సహాయం చేయాలి, మార్గనిర్దేశనం ఇవ్వాలి కానీ బాధ పెట్టొద్దన్నారు. ర్యాగింగ్ కి పాల్పడడం నేరం. జైలుశిక్ష, కళాశాల నుంచి తొలగిస్తారని తెలిపారు. ఎవరైనా ర్యాగింగ్‌కు గురైతే ఆత్మస్థైర్యం కోల్పోవడం, మానసికంగా కృంగిపోయి బాధపడకుండా ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ కు అలవాటు పడడం, ర్యాగింగ్ పేరుతో ఇతరులని బాధ పెట్టడం సరికాదన్నారు. క్యాంపస్‌లో సీసీ కెమెరాల నిఘా ఉందని.. పోలీస్ పెట్రోలింగ్, ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అకౌంట్ హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింక్స్, ఫిషింగ్ వంటి ఘటనలపై జాగ్రత్తలు పాటించాలి సూచించారు. సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్ ను సంప్రదించాలన్నారు.

