పుస్తకాలను చూసుకుంటూ కూడా పాఠాలు చదవలేని విద్యార్థులను చూసి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం బోధన కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాఠాలు చదివించారు. కొందరు విద్యార్థులు పాఠాలు సరిగ్గా చదవకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరిలో పదో తరగతి విద్యార్థులు కూడా ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ఆదేశించారు. ప్రతి రోజూ పాఠాలను బిగ్గరగా చదివించాలని సూచించారు .
బుధవారం భోదన కార్యక్రమంలో ప్రతి విద్యార్థిని భాగస్వామ్యం చేయాలని, ప్రతి ఒక్కరితో పాఠాలు చదివించాలని ఆదేశించారు. విద్యార్థులు పట్టుదలతో నేర్చుకోవాలని, అర్థం కానీ సబ్జెక్ట్ ను ఉపాధ్యాయుల ద్వారా మరోసారి అడిగి తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థుల చదువుపై శ్రద్ధ పెట్టని ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

