పంచాయతీ సర్పంచ్ ఎన్నిక కోసం ఆ ఊరిలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. ఇతరులెవరూ పోటీ లేకపోవడంతో ఆ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవంగా లాంఛనమే కానుంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల దాఖలు పర్వం పూర్తయింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి బీజేపీ బలపర్చిన సామ రాజిరెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల గడువు ముగియడంతో సామ రాజిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవంగా లాంఛనమే కానుంది.
సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే ఆ గ్రామానికి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులు కేటాయిస్తానని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో బీజేపీ పక్షాన తొలి ఏకగ్రీవం కావడంతో ఇచ్చిన మాట మేరకు ఆయా నిధులను అందజేస్తానని బండి సంజయ్ తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్నికల్లేకుండా సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులిస్తామని ప్రకటించింది.
ఈ లెక్కన పీచుపల్లికి మొత్తం రూ.20 లక్షల ప్రోత్సాహక నిధులు అందనున్నాయి. ఈ నిధులతో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని పీచుపల్లివాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో చేపట్టాల్సిన పనులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

