తన ఊరిని ప్రధానంగా పట్టి పీడిస్తున్న కోతుల సమస్యను సర్పంచ్ అభ్యర్థి పరిష్కరించాడు. సొంత ఖర్చులతో కోతులను పట్టించి గ్రామస్తులకు బెడద లేకుండా చేశాడు. నర్మెట్టలో ఎన్నో రోజులుగా కోతుల సమస్య తీవ్రంగా ఉన్నది. గత ప్రజాప్రతినిధులు ఈ సమస్యను ఏనాడూ పట్టించుకోకపోవడంతో గ్రామస్తులకు, రైతులకు తీరని నష్టం వాటిల్లుతున్నది. ఈ క్రమంలో సర్పంచ్ ఎన్నికలు రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపగోని శ్రీధర్ గౌడ్ ఒక అడుగు ముందుకేసి సమస్యను పరిష్కరించాడు.
దీని ద్వారా గ్రామ ప్రజల మేలు కోసం తాను గెలిస్తే ఎలా ముందుకు పోతాడో చెప్పకనే చెప్పాడు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామస్తులను పట్టి పీడిస్తున కోతుల బెడదను తను నామినేషన్ వేసిన మరుసటి రోజే తీర్చాడు. వందకు పైగా కోతులను సొంత ఖర్చులతో పట్టించి ఊరికి దూరంగా తరలించాడు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి మర్చిపోయే ప్రజాప్రతినిధులు ఉన్న ఈ రోజుల్లో ఎలాంటి హామీ ఇవ్వకుండానే ప్రజల సమస్య తీర్చి శ్రీధర్‌గౌడ్ గ్రామస్తుల మన్ననలు పొందాడు. తమ ఊరి సమస్య తీరడంతో గ్రామస్తులు ఎంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

