Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుపెద్దపల్లి ఎంపీ ప్రోటోకాల్ వివాదం తీవ్రం

పెద్దపల్లి ఎంపీ ప్రోటోకాల్ వివాదం తీవ్రం

TG:పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణకు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఇవ్వకపోవడం చుట్టూ నెలకొన్న వివాదం మరింత తీవ్రంగా మారింది. ఎంపీని ఆహ్వానించకుండా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం పట్ల కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి, జిల్లా కలెక్టరుకు స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూషణవేని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఎంపీ గడ్డం వంశీకృష్ణను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం, ప్రోటోకాల్ విషయంలో అధికారులు వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై ఇప్పటికే పార్లమెంటులో మోషన్ ఇచ్చినప్పటికీ, కలెక్టర్‌కు నోటీసులు వచ్చినా ఏ మార్పూ కనిపించలేదని అభిప్రాయపడ్డారు. ఎవరి ఒత్తిడితో ఎంపీని ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారో కలెక్టర్ స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీని మీరు స్వయంగా అవమానిస్తే ప్రజలకు ఏమి సందేశం వెళ్తుంది?” అని పార్టీ అధినాయకత్వాన్ని నిలదీశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించి అధికారిక ఫిర్యాదు చేయటమే కాకుండా, ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో బొంకూరి కైలాసం, బాలసాని సతీశ్, కుక్క చంద్రమౌళి, అల్లం సతీశ్, పాఠకుల మహేష్, ఆరేపల్లి రాహుల్, పత్తి లక్ష్మారెడ్డి, పర్స విజయ్, సాతురి రవి, పల్లె ప్రశాంత్, గడ్డం సతీశ్, పలకల సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు