పెద్దపల్లి: రాష్ట్రానికి ఆర్థిక వనరులను సమకూరుస్తున్న మత్స్యకారులను చిన్నచూపు చూడటం తగదని,మత్స్యకారుల జీవనానికి భద్రత కల్పించాలని ప్రగతి మత్స్య కార్మిక సేవాసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఉస్తేం శ్రీనివాస్ అన్నారు.ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో మంథని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పోతరేని క్రాంతి కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఉస్తేం శ్రీనివాస్ మాట్లాడారు.
ముదిరాజ్‌లను బీసీ-డీ నుండి బీసీ-ఏ కేటగిరీకి మార్చాలని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా విన్నవిస్తున్నా,ప్రభుత్వాలు తమ వినతులను నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు.దాదాపు 60 లక్షల పైచిలుకు ఉన్న ముదిరాజుల ఓటు బ్యాంకును గుర్తించాలని,లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో తమ ఐక్యతను ప్రదర్శించి ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శిస్తూ,ఏడు నెలలుగా కొత్త పథకాలు ప్రవేశపెట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
మత్స్యకారులకు అత్యవసరమైన వలలు,పడవలు, ఐస్ ఫ్యాక్టరీల ఏర్పాటు,డబ్బాలు వంటి పరికరాలను తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.వృత్తి ప్రమాదాల బారిన పడే మత్స్యకారులకు బీమా సౌకర్యం కల్పించి,ప్రమాదం జరిగిన వెంటనే ఆ మొత్తాన్ని కుటుంబాలకు అందించాలని కోరారు.ఈ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుని మత్స్యకారుల హక్కులను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అనంతరం క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా కారు పాకల రమేష్,ప్రణాళిక కమిటీ చైర్మన్‌గా నూనె రాజేశం, పెద్దపల్లి జిల్లా యూత్ అధ్యక్షుడిగా తలారి సాగర్, జిల్లా ఉపాధ్యక్షులు దామ సదయ్య, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షురాలు కొరిమి పద్మ, కొడిమ్యాల మండల అధ్యక్షురాలు తునికి వనజ, పెద్దపల్లి మండల ఉపాధ్యక్షులు తీగల ధర్మపురి, సుల్తానాబాద్ మండల ఉపాధ్యక్షుడిగా చొప్పరి సత్యపాల్లకు నియమిస్తూ వారికి నియామక పత్రాలను అందజేశారు.

