Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుర్యాలీ రణరంగం.. బీఆర్‌ఎస్‌ అర్ధనగ్న ప్రదర్శన

ర్యాలీ రణరంగం.. బీఆర్‌ఎస్‌ అర్ధనగ్న ప్రదర్శన

బెజ్జంకి: బీఆర్‌ఎస్‌ హయాంలో బేగంపేట నుంచి బెజ్జంకి వరకు మంజూరైన రోడ్డు పనులు అసంపూర్తి మిగిలిపోవడం, మండలంలోని పలు గ్రామాలకు వేస్తున్న రోడ్లు ఇంకా పూర్తికాకపోవడం, కాంగ్రెస్‌ సర్కారు పట్టించుకోకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు చేపట్టిన అర్ధనగ్న ర్యాలీ ప్రదర్శన రణరంగంగా మారింది. మండలంలోని బేగంపేట్‌ నుంచి బెజ్జంకి మండల కేంద్రం వరకు బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన, నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.

బేగంపేట నుంచి బెజ్జంకి మీదుగా పోతారం ఎక్స్‌రోడ్‌ వరకు, బెజ్జంకి-గుండారం-కిష్టాపూర్‌ వరకు, గుండారం-పేరక బండ-చౌడారం వరకు, బెజ్జంకి-కళ్లేపల్లి-రేపాక వరకు, బేగంపేట-వడ్లూర్‌- ఖాసింపేట, వీరాపూర్‌-బేగంపేట్‌, దేవక్కపల్లి స్టేజీ నుంచి వరుకోలు బ్రిడ్జి, బేగంపేట్‌-గునుకుల కొండాపూర్‌ వరకు అసంపూర్తిగా మిగిలి పోయిన రోడ్లను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీగా వెళ్లి బెజ్జంకి మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

పూర్తి చేయకుంటే ఆందోళనలు తీవ్రతరం
మండలంలో అన్ని గ్రామాల రోడ్లు అసంపూర్తిగా ఉండి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రెండేండ్లుగా రోడ్లు వేస్తానని చెప్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప అభివృద్ధి శూన్యమని, ప్రజలకు ఇచిన హామీలు మరిచారని బీఆర్‌ఎస్‌ బెజ్జంకి మండలాధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి మండిపడ్డారు. రోడ్డు పనులు మొదలై కాంట్రాక్టర్‌ కంకర పోసి వదిలేయడంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఎమ్మెల్యే కల్వంపల్లి సత్యనారాయణకు ఎన్నిసార్లు విన్నవించినా రోడ్డు సమస్యను పట్టించుకున్న పాపాన పోవడం లేదని, నాయకులకు, అధికారులకు కనువిప్పు కలిగేలా రోడ్డు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకపోవాలనే ఉద్దేశంతో నిరసన తెలిపినట్టు చెప్పారు. గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తమ నిరసనలు ఇంకా తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసన కారులను చెదరగొట్టారు. లాఠీలు ఝులిపించి గల్లాపట్టి మరీ అరెస్ట్‌ చేశారు.

ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బలవంతంగా బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్ట్‌ చేసి కోహెడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ కె. శ్రీనివాస్, ఎస్సై బోయిని సౌజన్య బందోబస్తును నిర్వహించారు.

Related News

తాజా వార్తలు