-బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి.
-రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పోటీకి సిద్ధం.
-సిపిఐ వందేళ్ళ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.
-సిపిఐ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి.
చిగురు మామిడి మండల కేంద్రంలోని సిపిఐ మండల సమితి కార్యాలయం ముస్కురాజిరెడ్డి స్మారక భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ సీనియర్ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. గతంలో దేశంలో భూస్వాముల,పెత్తందారుల, దేశ్ ముక్ చేతుల్లో పరిపాలన కొనసాగితే,నేడు ప్రజాస్వామ్యంలో బడా బడా పెట్టుబడిదారుల, కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా ప్రజాస్వామ్య ముసుగులో పరిపాలన కొనసాగుతుందని ఆయన అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల మాట్లాడే స్వేచ్ఛ ప్రశ్నించే హక్కులు కలిగాయని కానీ నేటి పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజల హక్కులను హరిస్తున్నారని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో చత్తీస్గడ్‌లో ఇతర ప్రాంతాల్లో అనేకమంది మావోయిస్టులను చంపారని మండిపడ్డారు.
ఈనెల 27,28 తేదీలలో దేశంలోని అన్ని రాష్ట్రాల డీజీపీ,ఐజీల సమావేశం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరపాలని చూస్తున్నారని, ఆ సమావేశాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించి,ప్రధాని నరేంద్ర మోడీ ముగుస్తారని తెలిసిందన్నారు. మావోయిస్టులను పూర్తిగా అంతం చేయాలనే కుట్ర జరుగుతుందని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం మంచిది కాదని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు విసిరితే ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకో లేదంటే కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. పాలకులకు నచ్చితే ఒక విధంగా నచ్చకపోతే మరొక విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య పరిపాలనలో మంచిది కాదని, ఇలాగే పరిపాలన కొనసాగితే,నియంతృత్వ ఫ్యూడల్ వ్యవస్థ మళ్లీ పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయనే అనుమానం కలుగుతుందని చాడ వెల్లడించారు.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయన్నారు.పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు లేవని,స్పీకర్‌కు ఇష్టం ఉంటే పెండింగ్‌లో పెట్టడం,ఇష్టం లేకుంటే తీసివేయడం జరుగుతుందన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యం నాలుగు కాలాలపాటు ఉండాలంటే ప్రగతీశీల,లౌకిక శక్తులు,వామపక్షాలు ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు చాడ.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం మూలంగా కేంద్రం నుండి రావాల్సిన నిధులు నిలిచిపోతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని, రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ ప్రకారం రిజర్వేషన్లు పెంచుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అందించాలని, రిజర్వేషన్ల పెంపు బిల్లు గవర్నర్,రాష్ట్రపతి వద్దకు పంపితే ఆ బిల్లు పెండింగ్ ఉండడం మూలంగా ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు ఎదురవుతున్నాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మరియు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైతేనే రిజర్వేషన్ల పెంపుకు సాధ్యమవుతుందని కానీ బిజెపి ఎటు తేల్చకపోవడం అన్యాయమని, రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం అన్ని పక్షాలతో పాటు బీసీ సంఘాలను ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు.
కాంగ్రెస్ పార్టీతో సిపిఐ ఇప్పటికీ మిత్రపక్షంగానే ఉందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు పిలిస్తే చర్చిస్తామని తెలిపారు. నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పనిచేసే సిపిఐ ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తుందని, చిగురుమామిడి మండలంలో అన్ని గ్రామాల్లో సిపిఐ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
సిపిఐ వందేళ్ళ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని,తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే వందేళ్ల ఉత్సవాల బహిరంగ సభ విజయవంతం కోసం రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రచార జాతాలు జరుగుతున్నాయని, జోడేఘాట్ లో ప్రారంభమైన జాత ఈ నెల 21న భద్రాచలంలో ముగియనుందని చాడ తెలిపారు.

